
లైవ్: తమిళనాడును వణికిస్తున్న మరో ముప్పు!
- రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు
వర్దా తుపానుతో ఛిన్నాభిన్నం అయిన తమిళనాడును మరో ముప్పు వెంటాడుతోంది. రానున్న 12 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. సోమవారం ఒక్కసారిగా విరుచుకుపడిన వర్దా తుపానుతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లను అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ తుపాను దెబ్బకు రెండు రాష్ట్రాల్లో దాదాపు 12 మంది ప్రాణాలు విడిచారు. తుపాను దెబ్బకు పూరిళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రోడ్ల మీద వాహనాలు గాలిలో గింగిరాలు తిరిగాయి.
ఈ తుపాను దెబ్బతో చెన్నై నగరం తీవ్రంగా అల్లాడింది. అయితే, మంగళవారం నాటికి చెన్నైలో పరిస్థితులు కొంతమేరకు కుదటపడ్డాయి. సాధారణ జనజీవనం క్రమంగా మెరుగుపడుతోంది. చెన్నై విమానాశ్రయంలో తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయితే, తమిళనాడు ప్రభుత్వం మాత్రం ముందుజాగ్రత్త చర్యగా వరుసగా రెండోరోజు చెన్నై, కాంచీవరం, తిరువల్లూరు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించింది. మరోవైపు వర్దా తుపాను సంభవించినప్పటికీ ఈ నెల 16 నుంచి చెన్నైలోని చెపాక్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్టు మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం యథాతథంగా జరగనుంది. ఇక వర్దా తుపాను క్రమంగా బలహీన పడుతోందని, గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తున్నదని, దీని ప్రభావంతో రానున్న 12 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణశాఖ తెలిపింది.