అంధకారంలో తమిళ రాజధాని
చెన్నై: వర్దా తుపాను కారణంగా చెన్నై మహానగరం చీకటిమయం అయింది. ఆదివారం రాత్రి 10 గంటల నుంచే కరెంట్ లేకపోవడంతో చెన్నై వాసులు చీకట్లో మగ్గుతున్నారు. ఈ రోజు తుపాను తీరం దాటే సమయంలో పెనుగాలులు వీయడంతో కరెంట్ స్తంభాలు నెలకొరిగాయి. చెట్లు విరిగిపడడంతో కరెంట్ తీగలు తెగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
కరెంట్ లేకపోవడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా స్తంభించింది. విద్యుత్ నిలిచిపోవడంతో సెల్ టవర్లు పనిచేయడం లేదు. మొబైల్ ఫోన్ సర్వీసులు నిలిచిపోయాయి. ఇంటర్నెట్ కూ అంతరాయం కలిగింది. తుపాను నేపథ్యంలో అమ్మ క్యాంటీన్లను 24 గంటలూ తెరిచివుంచాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం పన్నీరు సెల్వం ఆదేశించారు.