వర్దా తుపానుపై సోనియా ఆందోళన
న్యూఢిల్లీ: వర్దా తుపాను చెన్నై-పులికాట్ సరస్సు మధ్య తీరాన్ని తాకిన నేపథ్యంలో తమిళనాడులోని సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. 'వర్దా తుపాను చెన్నై సమీపంలో తీరాన్ని తాకిన నేపథ్యంలో నగరం ఎదుర్కొనే పరిస్థితులపై ఆందోళన చెందుతూ.. ప్రకృతి ప్రకోపాన్ని తట్టుకొని నిలబడాలని ప్రార్థిస్తున్నాం. ఈ కష్టకాలంలో ప్రజల భద్రతకు స్థానిక అధికార యంత్రాంగాలు సరైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నాయని మేం ఆశిస్తున్నాం.
గత ఏడాది ఇలాంటి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్న చెన్నై, తమిళనాడు ప్రజలు మరోసారి అదే మొక్కవోని ధైర్యసాహసాలను ప్రదర్శించి ఈ విపత్తును ఎదుర్కొంటారని దేశం ఆశిస్తోంది. ఈ సమయంలో యావత్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంది' అని ఒక ప్రకటనలో సోనియాగాంధీ తెలిపారు. ప్రచండ గాలులు, అతి భారీ తుపానుతో వర్దా అత్యంత శక్తిమంతంగా తీరాన్ని దాటిన సంగతి తెలిసిందే. ఈ ప్రకృతి ప్రకోపంలో ఏడుగురు ప్రాణాలు విడిచారు.