మాజీ స్పీకర్ సంగ్మా కన్నుమూత
గుండెపోటుతో మృతి
* పార్లమెంట్ ఉభయ సభల్లో నివాళి
* గొప్ప నేతను కోల్పోయామన్న ప్రణబ్, మోదీ, సోనియా
న్యూఢిల్లీ: లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా(68) గుండెపోటుతో శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలో మృతిచెందారు. మూడు దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన మేఘాలయలోని తుర నుంచి 9 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. సంగ్మాకు భార్య సరోదిని, కుమారులు కాన్రడ్, జేమ్స్‌లతో పాటు కుమార్తె అగథాలు ఉన్నారు. నివాళిగా లోక్‌సభను ఒకరోజుపాటు వాయిదా వేయగా.... ప్రొటొకాల్‌ను పక్కనపెట్టి రాజ్యసభను లంచ్ విరామం తర్వాత వాయిదా వేశారు.
రాజకీయ ప్రస్థానం: సెప్టెంబర్ 1, 1947న జన్మించిన సంగ్మా 1980-88 మధ్య కేంద్రంలో సహాయమంత్రిగా పనిచేశారు. పీవీ కేబినెట్‌లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1996-98కాలంలో లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారు. సోనియా విదేశీయతను ప్రశ్నించడంతో 1999లో కాంగ్రెస్ నుంచి బహిష్కృతడయ్యారు. శరద్‌పవార్, తారిక్ అన్వర్‌లతో కలిసి ఎన్సీపీని స్థాపించారు.
2004లో ఎన్సీపీ నుంచి బయటకొచ్చి తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి నేషనలిస్ట్ తృణముల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. కొన్నాళ్లకు ఆ పార్టీ నుంచి తప్పుకుని నేషనల్ పీపుల్స్ పార్టీని స్థాపించి ప్రస్తుతం ఆ పార్టీ నుంచే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2012లో ప్రణబ్‌ముఖర్జీపై బీజేపీ తరఫున రాష్ట్రపతి పదవికి పోటీపడ్డారు. 1988 నుంచి 90 వరకూ మేఘాలయ సీఎంగా పనిచేశారు.
ప్రముఖుల నివాళి
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి సంగ్మా కృషి ఎంతో గొప్పదని ప్రధాని ట్విట్టర్‌లో కొనియాడారు. దేశం బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోయిందని రాష్ట్రపతి ప్రణబ్ సంతాప సందేశంలో పేర్కొన్నారు. గొప్పవ్యక్తిని, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ముఖ్యమైన గొంతును పొగొట్టుకున్నామంటూ సోనియా సంతాపం తెలిపారు. రాజస్థాన్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, తమిళనాడు సీఎంలుసహా పలువురు ప్రముఖులు సంగ్మా మృతికి సంతాపం తెలిపారు. మేఘాలయలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తారు.
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం
హైదరాబాద్: సంగ్మా మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రగాఢ సంతాపం తె లిపారు. గొప్ప పార్లమెంటేరియన్ అని, ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎదిగిన గొప్ప నాయకుడని కొనియాడారు.