
సాక్షి, న్యూఢిల్లీ : సంజయ్ లీలా భన్సాలీ చెక్కిన వివాదాస్పద చారిత్రక దృశ్య కావ్యం పద్మావత్‌పై ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. పద్మావత్ మూవీ చుట్టూ ముసిరిన వివాదం, దాన్ని డీల్ చేసిన విధానం భారత్‌లో పెట్టుబడుల ప్రవాహంపై, ఉపాధి అవకాశాలపై సందేహాలను ముందుకుతెచ్చిందన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీం కోర్టు సైతం ఒక సినిమాను విడుదల చేయలేక చేతులెత్తేస్తే ఇక పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు.
విదేశీ పెట్టుబడులను పక్కనపెడితే..దేశీయ పెట్టుబడిదారులే ఈ పరిస్థితులను జీర్ణించుకోలేకపోయారని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఇప్పటికే కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఇది మంచిది కాదని..దేశంలో నెలకొన్న పరిస్థితులు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తాయని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. వివాదాస్పద పద్మావత్ మూవీ విడుదలను నిరసిస్తూ రాజ్‌పుట్, హిందూ సంస్థల ఆందోళనల నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.