మంత్రి సచిన్‌తో పద్మశాలీల భేటీ
సాక్షి, ముంబై: తమ సంస్థ గదికి నామమాత్రపు అద్దె వసూలు చేయాలని కోరుతూ ‘పద్మశాలి సమాజ సుధారక మండలి’ కి చెందిన సభ్యులు గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి సచిన్ అహిర్‌తో భేటీ అయ్యారు. మంత్రాలయ ఎదురుగా ఉన్న ఆయన విశ్రాంతి గృహంలో మంగళవారం ఈ బృందం కలిసి వినతి పత్రం అందజేసింది. నగరంలో కొన్ని ప్రముఖ ప్రార్థన మందిరాలకు, సేవా సంస్థలకు ప్రభుత్వం నామమాత్రపు అద్దె రూపాయి చొప్పున వసూలు చేస్తోంది.
ఇదే తరహాలో తమ సంస్థ గదికి నామమాత్రపు అద్దె వసూలు చేసేలా ప్రజా పనులశాఖకు సూచించాలని కోరుతూ అహిర్‌కు విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన సానుకూలంగా వ్యవహరించారు. వచ్చే శాసన సభ ఎన్నికలలోపే ఈ సమస్య పరిష్కరించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అహిర్‌ను కలిసిన ఈ బృందంలో ట్రస్టీలు భోగ సహదేవ్, గాజెంగి రమేశ్, ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, జిందం భాస్కర్, సురేశ్ సురుకుట్ల, గుజ్జేటి గంగాధర్, వేముల మనోహర్, అల్లె శంకరయ్య తదితర సభ్యులు ఉన్నారు.