housing Construction Department
-
గృహ నిర్మాణశాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ కింద ఇళ్ల నిర్మాణం వేగాన్ని పెంచాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే 7.43 లక్షల ఇళ్లను అక్కచెల్లెమ్మలకు అందించామన్న అధికారులు.. ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల ఇళ్లు పూర్తిచేసే దిశగా ముందుకు సాగుతున్నామని అధికారులు తెలిపారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని వెల్లడించారు. సీఎం జగన్ మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా రాజీ పడవద్దని స్పష్టం చేశారు. కరెంటు, తాగు నీరు ఉన్నాయా? లేవా? అన్న వాటిపై ఆడిట్ చేయించాలన్నారు. ఇప్పటివరకూ తీసుకున్న రుణాలపై వడ్డీ డబ్బు విడుదలకు సన్నద్ధం కావాలన్న సీఎం.. టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన అసోసియేషన్లు సమర్థవంతంగా పనిచేసేలా వారికి తగిన అవగాహన కల్పించాలని, ప్రభుత్వం ఇచ్చిన లక్షల విలువైన ఆస్తిని ఎలా నిర్వహించుకోవాలన్న దానిపై వారికి అవగాహన ఇవ్వాలి’’ అని సీఎం సూచించారు. ఈ సమీక్షా సమావేశానికి గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ దవులూరి దొరబాబు, సీఎస్ జవహర్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సెక్రటరీ దీవాన్ మైదీన్, టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వీ జీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: చంద్రబాబు మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది వైద్యులా? రాజకీయ నేతలా?: సజ్జల -
శ్రీకాకుళం కలెక్టరేట్ లో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష
-
సంపూర్ణ హక్కుతో నిశ్చింత
‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకం(జేఎస్‌జీహెచ్‌పీ) కింద గృహ నిర్మాణ సంస్థ సహకారంతో ఇళ్లు నిర్మించుకున్న లక్షల మంది పేదలకు భారీ లబ్ధి చేకూరుతోంది. పేదల ఆస్తుల విలువ పెరగడంతో పాటు పూర్తి భద్రత దక్కుతోంది. పథకం కింద 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకూ నిర్మించిన ఇళ్లకు గృహ నిర్మాణ సంస్థ రుణంతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పిస్తున్న విషయం తెలిసిందే. అత్యధికంగా పొజిషన్ సర్టిఫికెట్స్ గృహ నిర్మాణ సంస్థ సహకారంతో ఇళ్లు నిర్మించుకున్న పేదల్లో పొజిషన్ సర్టిఫికెట్, డీ పట్టాదారులే ఎక్కువ మంది ఉన్నారు. గృహ నిర్మాణ సంస్థ వద్ద ఉన్న 51.8 లక్షల మంది వివరాలను మునిసిపాలిటీలు/పంచాయతీలకు బదిలీ చేసింది. వీరిలో 45.5 లక్షల మంది వివరాలను గ్రామ/వార్డు సచివాలయాలకు ట్యాగ్ చేశారు. వలంటీర్లు, మునిసిపల్, రెవెన్యూ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి ఇళ్లలో నివసిస్తున్న వారి వివరాలు, స్థల స్వభావాన్ని గుర్తిస్తున్నారు. 76 శాతం మందికి పొజిషన్ సర్టిఫికెట్లు, 20 శాతం మందికి డీ పట్టాలుండగా కేవలం 4 శాతం మంది మాత్రమే రిజిస్టర్డ్ స్థలాలు కలిగిన వారున్నట్లు వెల్లడైంది. గతంలో వడ్డీ మాఫీలు మాత్రమే గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు తీసుకున్న వారికి గత ప్రభుత్వాలు వన్‌టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్) కింద వడ్డీల్లో మాత్రమే రాయితీ ఇస్తూ వచ్చాయి. రాయితీ పోనూ రుణం చెల్లించిన వారికి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చి తనఖాలో ఉన్న ధ్రువపత్రాలు విడుదల చేశారు. ఇప్పుడు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్ రూపంలో అసలు, వడ్డీ రెండిటికి రాయితీ ఇవ్వడంతో పాటు పేదలకు ఆస్తులపై పూర్తి యాజమాన్య హక్కుల కల్పనకు శ్రీకారం చుట్టడం గమనార్హం. రిజిస్ట్రేషన్ చార్జీలు, ఫీజులు లేకుండా యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా పేదలకు భారీ ఊరట లభించనుంది. సాధారణంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లలో విలువపై 7.5 శాతం ఫీజులు, చార్జీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి. ఇప్పుడు అవేవీ లేకుండా రుణగ్రహీతలు గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, మునిసిపాల్టీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20 వేలు చెల్లిస్తే స్థలాలపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ ధ్రువపత్రం జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పలు ప్రయోజనాలు గృహ నిర్మాణ సంస్థ సహకారంతో రుణాలు తీసుకున్న వారంతా రోజువారీ కూలీలు, చిరువ్యాపారులు, ఇతర పనులకు వెళ్తూ పొట్టపోసుకునేవారే. పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్ల సమయంలో డబ్బు అవసరమై బ్యాంకులకు వెళితే రుణాలు అందక అవస్థలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు పూర్తి యాజమాన్య హక్కులు సంక్రమించడం వల్ల ఆస్తులను తనఖా పెడితే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. డీ పట్టా, పొజిషన్ సర్టిఫికెట్ స్థలాలకు మార్కెట్లో విలువ తక్కువగా ఉంటుంది. రిజిస్టర్ ఆస్తులతో పోలిస్తే ప్రాంతాలను బట్టి 20 నుంచి 50 శాతానికిపైగా విలువ తక్కువగా ఉంది. ఇప్పుడు ఈ వ్యత్యాసం లేకుండా ఆస్తుల విలువ పెరుగుతుంది. డీ పట్టా, పొజిషన్ సర్టిఫికెట్లను వారసుల పేర్లపై బదలాయించడానికి ఆస్కారం ఉండదు. ప్రభుత్వం జారీ చేసే విక్రయపత్రం ద్వారా ఆస్తులను వారసుల పేర్లపై బదలాయించుకోవడంతో పాటు ఇతరులకు అమ్మడానికి హక్కులు లభించనున్నాయి. అమాయకులైన పేదలను మోసగించి తప్పుడు పత్రాలతో కబ్జాలకు పాల్పడే ఆస్కారం లేకుండా ఆస్తులకు పూర్తి భద్రత లభిస్తుంది. మా ఆస్తికి మరింత విలువ నా భర్త ముఠా కూలీ. డీ పట్టా స్థలంలో 2004–2008 మధ్య ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహ నిర్మాణ సంస్థ రుణంతో ఇల్లు నిర్మించుకున్నాం. వడ్డీతో కలిపి రుణం సుమారు రూ.40 వేలకు చేరుకుంది. ఇటీవల వలంటీర్, సచివాలయ సిబ్బంది మా ఇంటికి వచ్చి వివరాలు సేకరించారు. రూ.15 వేలు చెల్లిస్తే ఆస్తిపై పూర్తి యాజమాన్య హక్కులు వస్తాయని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే హక్కు పత్రం ద్వారా వారసులకు ఆస్తి బదలాయించడంతో పాటు ఇతరులకు అమ్ముకోవచ్చని చెప్పారు. యాజమాన్య హక్కులు కల్పిస్తే మా ఆస్తికి విలువ పెరుగుతుంది. మాకు బ్యాంక్ రుణాలు మంజూరు అవుతాయి. చాలా సంతోషంగా ఉంది. – మర్రి ప్రసన్నలక్ష్మి, తెనాలి, గుంటూరు జిల్లా -
పేదల ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు పెద్దపీట
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కింద తొలి దశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాల నాణ్యతలో ఎక్కడా రాజీ పడేందుకు వీల్లేదన్న ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో గృహ నిర్మాణ శాఖ ఆ మేరకు చర్యలు తీసుకుంటోంది. ఇళ్ల నిర్మాణాల్లో వినియోగించే మెటీరియల్‌కు నాణ్యత పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రధానంగా సిమెంట్ నాణ్యత విషయంలో ఎటువంటి తేడా రాకుండ పటిష్టమైన నాణ్యత పరీక్షలకు మార్గదర్శకాలు జారీ చేసింది. పేదల ఇళ్ల నిర్మాణాలకు తక్కువ ధరకే నాణ్యమైన సిమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే సమకూరుస్తున్న విషయం తెలిసిందే. ఇందు కోసం గృహ నిర్మాణ శాఖ గ్రామ సచివాలయాలు, మండల స్థాయిల్లో గోదాములను అద్దెకు తీసుకుంది. సిమెంట్, స్టీలు, ఇతర మెటీరియల్‌ను ఆ గోదాముల్లో నిల్వ చేస్తోంది. సిమెంట్‌ను జిల్లాల వారీగా వైఎస్సార్ నిర్మాణ పోర్టల్ ద్వారా కొనుగోలు చేయాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలు చేసే సిమెంట్‌కు తొలుత 98 శాతం మాత్రమే బిల్లు చెల్లించాలని, నాణ్యత పరీక్షలు పూర్తయ్యాకే మిగతా రెండు శాతం చెల్లించాలని స్పష్టం చేసింది. మార్గదర్శకాలు ఇలా.. ► ప్రతి సంస్థ సరఫరా చేసిన సిమెంట్ నుంచి జిల్లా యూనిట్‌గా రెండు గోదాముల నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి (ఏప్రిల్–జూన్, జూలై–సెప్టెంబర్, అక్టోబర్–డిసెంబర్, జనవరి–మార్చి) నమూనాలను సేకరించాలి. ► ప్రతి త్రైమాసికంలో వేర్వేరు గోదాముల నుంచి నమూనాలను సేకరించాలి. నమూనాల సేకరణ సమయంలో సిమెంట్ కంపెనీల ప్రతినిధిని భాగస్వామ్యం చేయాలి. ► సేకరించిన నమూనాలను ప్రాజెక్టు డైరెక్టర్లు పరీక్షల కోసం తిరుపతిలోని ఐఐటి, ఎస్వీ విశ్వవిద్యాలయం.. తాడేపల్లిగూడెం ఎన్ఐటి, హైదరాబాద్‌లోని ఎన్‌సీసీబీఎం, విమ్తా ల్యాబ్స్, బ్యూరో వెరిటాస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భగవతి–అనా–ల్యాబ్స్‌కు పంపాలి. ► వీటితో పాటు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, కాకినాడ జేఎన్టీయూ, విజయవాడలోని కేఎల్ విశ్వవిద్యాలయం, సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విజయనగరం, అనంతపురంలోని జేఎన్టీయూ ప్రయోగశాలలకు పంపించాలి. ► సిమెంట్ నాణ్యతను నిర్ణయించడానికి గోదాముల వద్ద క్షేత్ర స్థాయి పరీక్షలు చేయాలి. సిమెంట్‌లో గట్టి ముద్దలు ఉంటే తిరస్కరించాలి. సిమెంట్‌ను వేళ్లతో రుద్దినప్పుడు సున్నితంగా ఉండాలి. అలాకాకుండా కణికలాగ ఉంటే ఇసుకతో కల్తీ చేసినట్లు భావించాలి. క్షేత్ర స్థాయి తనిఖీల్లో తేడా ఉంటే ఆ సిమెంట్‌ను తిరస్కరించాలి. -
యజ్ఞంలా ఇళ్ల నిర్మాణం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: పేదలకు సంబంధించిన అన్ని ఇళ్ల నిర్మాణ పనులను మే 31 నాటికి మొదలు పెట్టాల్సిందేనని, ఉద్యమ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేలా కలెక్టర్లు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఒకవైపు కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూనే ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా చర్యలు చేపట్టడం అత్యవసరమని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున గృహ నిర్మాణాల ద్వారా సిమెంట్, ఇసుక, ఐరన్ వినియోగం పెరిగి ఎకానమీ వృద్ధి చెందుతుందని, మరోవైపు సొంతిళ్ల నిర్మాణం ద్వారా పేదలకు ఇంటివద్దే స్థానికంగా పనులు దొరుకుతాయన్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థ మందగించకుండా ప్రజలకు ఉపాధి కల్పించవచ్చన్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్ ఇళ్ల స్థలాల పంపిణీని ఎట్టి పరిస్థితుల్లోనూ పక్షం రోజుల్లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. టెండర్లు పూర్తయిన 839 లే అవుట్లలో పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. తొలి దశలో చేపట్టిన 14.89 లక్షల ఇళ్లకుగానూ ఇప్పటికే చాలావరకు మొదలయ్యాయని, మిగతావి కూడా మే 31 నాటికి కచ్చితంగా మొదలు కావాల్సిందేనని స్పష్టం చేశారు. పనుల పురోగతిపై సమీక్షకు మండల, మునిసిపల్, జిల్లా, డివిజన్ స్థాయిల్లో సీనియర్ అధికారులను నియమించాలని సూచించారు. దరఖాస్తుదారుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ నిర్దేశించిన ప్రకారం 90 రోజుల్లోగా ఇంటి స్థలం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా సీఎం మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పనులు (లేబర్ బడ్జెట్), గ్రామ సచివాలయాల భవనాలు, ఆర్బీకేల భవనాలు, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, ఏఎంసీయూ, బీఎంసీయూ, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాలు, స్పందన సమస్యల పరిష్కారంపై సీఎం మార్గనిర్దేశం చేశారు. వివరాలు ఇవీ.. ఇళ్ల స్థలాల పట్టాలు రాష్ట్రంలో మొత్తం 30,28,346 ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 28,54,983 పట్టాల పంపిణీ జరిగింది. ఇది 94 శాతం కాగా ఇంకా 1,73,363 ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాల్సి ఉంది. మొత్తం 17,053 జగనన్న కాలనీల్లో 16,450 చోట్ల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ పూర్తయింది. నెల్లూరు, గుంటూరు, విజయనగరం, వైఎస్సార్ కడపతోపాటు ఉభయ గోదావరి జిల్లాలలో పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ 15 రోజుల్లో పూర్తి చేయాలి. వారికోసం వేగంగా భూ సేకరణ.. ఇళ్ల స్థలాల కోసం మొత్తం 5,48,690 దరఖాస్తులు రాగా 51,859 మంది అర్హులని గుర్తించారు. మరో 2,21,127 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీఆర్వోలు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు, సబ్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల వద్ద దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అర్హులుగా గుర్తించిన 51,859 మందిలో 14,410 మందికి ఇప్పుడున్న లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయవచ్చు. మరో 6,004 మందికి ప్రభుత్వ భూముల్లో కొత్తగా వేస్తున్న లేఅవుట్లలో ఇవ్వనుండగా 31,445 మంది కోసం కొత్తగా భూసేకరణ జరపాల్సి ఉంది. 31,445 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు భూసేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ లక్ష్యం మేరకు 90 రోజుల్లోగా ఇంటి స్థలం ఇవ్వాలి. ఇళ్ల నిర్మాణం.. తొలి విడతలో సమగ్ర ప్రాజెక్టు నివేదికలు పూర్తి కాకపోవడంతో 71 వేల మందికి ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయలేదు. ప్రత్యామ్నాయ డీపీఆర్‌లు సిద్ధం చేసి పంపాలి. ప్లాట్ల డీ మార్కింగ్ లేకపోవడం, సరిహద్దు రాళ్లు పాతకపోవడం వల్ల 742 లేఅవుట్లలో 1.46 లక్షల ప్లాట్ల జియో ట్యాగింగ్ జరగలేదు. ఇవన్నీ వెంటనే పూర్తి చేయాలి. ఏపీ హౌసింగ్ వెబ్సైట్లో లబ్ధిదారుల నమోదు కేవలం 71 శాతం వరకు పూర్తయింది. మిగతాది పూర్తి చేయాలి. నాన్ యూఎల్బీలలో ఉపా«ధి హామీ కింద జాబ్ కార్డుల మ్యాపింగ్ కూడా 75 శాతమే పూర్తి అయింది. మిగతాది పూర్తి చేయాలి. వీటన్నింటినీ మే 15 నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాలి. లేఅవుట్లలో నీటి సరఫరా, విద్యుదీకరణ.. మొదటి దశలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన 8,905 లేఅవుట్లలో 8,668 లేఅవుట్లలో నీటి సరఫరా చేయాల్సి ఉంది. వాటిలో 6,280 లేఅవుట్లలో పనులు మొదలు కాగా 1,532 లేఅవుట్లలో పనులు పూర్తయ్యాయి. మిగిలిన లేఅవుట్లలో కూడా పనులు పూర్తయ్యేలా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించాలి. పెండింగ్‌లో ఉన్న 1,549 లేఅవుట్లలో టెండర్లు పూర్తి చేయాలి. టెండర్లు పూర్తి అయిన 839 లేఅవుట్లలో పనులు వెంటనే మొదలు పెట్టాలి. గ్రామ సచివాలయాల భవనాలు.. 10,929 గ్రామ సచివాలయాల నిర్మాణాలు మొదలు కాగా ఇప్పటివరకు 6,057 భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. మరో 1,035 భవనాల నిర్మాణం తుది దశలో ఉండగా 613 భవనాల శ్లాబ్ పనులు పూర్తయ్యాయి. నెల్లూరు, కృష్ణా, అనంతపురం జిల్లాలలో చాలా జాప్యం జరుగుతోంది. కడప, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో కూడా పనులు ఆలస్యం అవుతున్నాయి. నిర్దేశించుకున్న ప్రకారం అన్ని గ్రామ సచివాలయాల భవనాలు వచ్చే జూన్ చివరి నాటికి పూర్తి చేయాలి. ఏఎంసీయూ, బీఎంసీయూల నిర్మాణం రాష్ట్రంలో మొత్తం 9,899 బీఎంసీయూల అవసరం ఉండగా 9,538 భవనాల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులు మంజూరయ్యాయి. తొలిదశలో చేపట్టిన 2,633 భవనాలతో సహా మొత్తం 4,840 భవనాల పనులు మొదలయ్యాయి. తొలిదశ బీఎంసీయూలను జూన్ 30 నాటికి పూర్తి చేయాలి. రాష్ట్రంలో అమూల్ ఇప్పటికే పాల సేకరణ మొదలు పెట్టింది. వైఎస్సార్ అర్బన్ క్లినిక్‌లు.. రాష్ట్రంలో 560 వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్ అవసరం ఉండగా ఇప్పటికే ఉన్న 205 అర్బన్ హెల్త్ సెంటర్లలో మరమ్మతులు చేపట్టి అభివృద్ధి చేయాల్సి ఉంది. కొత్తగా 353 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించాల్సి ఉంది. వాటిలో 311 భవనాల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా మిగిలిన వాటి టెండర్లు పూర్తి చేయాల్సి ఉంది. రైతు భరోసా కేంద్రాలు 10,408 భవనాల నిర్మాణానికి అనుమతి రాగా కేవలం 2,649 మాత్రమే పూర్తయ్యాయి. 139 భవనాల పనులు తుదిదశలో ఉండగా 640 భవనాల శ్లాబ్ పనులు పూర్తయ్యాయి. కృష్ణా, విశాఖపట్నం, అనంతపురంతో పాటు కడప, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలలో పనులు ఆలస్యం అవుతున్నాయి. ఈ భవనాల పనులన్నీ ఈ ఏడాది జూలై నాటికి పూర్తి కావాలి. డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ (రూరల్)... 8,585 భవనాలకు గానూ ఇప్పటివరకు 1,755 భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. మరో 63 భవనాల పనులు తుదిదశలో ఉండగా 400 భవనాల శ్లాబ్ పనులు పూర్తయ్యాయి . 4,118 భవనాల పనులు శ్లాబ్ వేసే వరకు జరిగాయి. అన్ని క్లినిక్‌ల నిర్మాణం ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి పూర్తి కావాలి. అనంతపురం, విశాఖపట్నం, కర్నూలు, కడప, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలలో పనులు ఆలస్యం అవుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలు మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాలలో 27,438 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. నాడు–నేడు మొదటి దశలో కొత్తగా 4706 అంగన్వాడీ కేంద్రాలతో పాటు ప్రస్తుతమున్న 3341 అంగన్వాడీల స్థాయి పెంచే పనులు కొనసాగుతున్నాయి. 3928 భవనాల నిర్మాణ పనులు సాగుతున్నాయి. లక్ష్యానికి అనుగుణంగా వచ్చే జూన్ 30 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాలలో పనుల్లో జాప్యం జరుగుతోంది. ఆయా జిల్లాల కలెక్టర్లు వాటిపై దృష్టి పెట్టాలి. స్పందన సమస్యలు స్పందన కార్యక్రమంలో ఇప్పటివరకు 2,19,81,131 సర్వీస్ రిక్వెస్టులు రాగా 2,14,78,165 పరిష్కరించారు. (97.71శాతం). నిర్దేశించిన గడువులోగా 1,83,68,988 దరఖాస్తులను పరిష్కరించగా కాస్త ఆలస్యంగా 31,09,166 అర్జీలను పరిష్కరించారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ, ఇళ్ల స్థలాలకు సంబంధించిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. మోడల్ హౌస్‌లు.. ప్రతి లేఅవుట్లో మోడల్ హౌస్ నిర్మించాలి. ఇప్పటికే 4,374 లేఅవుట్లలో మోడల్ హౌస్‌ల నిర్మాణం మొదలు కాగా మిగిలిన 4,500 లేఅవుట్లలో పనులు మొదలవ్వాలి. ఉపాధి హామీ పనులు.. కోవిడ్ నేపథ్యంలో ఉపాధి హామీ కీలకం. మనకు 20 కోట్ల పని దినాలకు అనుమతి ఉండగా గత ఏడాది పెంచారు. ఏప్రిల్‌లో 2.50 కోట్ల పని దినాలు లక్ష్యం కాగా ఈనెల 26 నాటికి 1.89 కోట్లే సాధించగలిగాం. వచ్చే రెండు నెలల్లో ప్రతి జిల్లాలో కోటి పని దినాలు సాధించి తీరాలి. నెల్లూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో వేజ్ కాంపోనెంట్ ఇంకా పెరగాలి. ఈనెల, వచ్చే నెల కార్యక్రమాలు ఇవీ ఏప్రిల్ 28: జగనన్న వసతి దీవెన మే 13: రైతు భరోసా మే 18: మత్స్యకార భరోసా మే 25: 2020 ఖరీఫ్ ఇన్సూరెన్స్ డబ్బుల చెల్లింపు సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, బొత్స సత్యనారాయణ, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయకుమార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
స్థలం + ఇల్లు.. రెట్టింపు ఆనందం
సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి ఇరుకు గదుల్లో.. కాలువ గట్ల వెంబడి.. అద్దె వసారాల్లో.. కాలం గడుపుతున్న లక్షలాదిమంది పేదలకు ఇప్పుడు ఆనందం రెట్టింపయింది. ఈ ఆనందాన్ని తమకిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని.. తమ జీవితకాలం మరచిపోబోమని వారు చెబుతున్నారు. ఇంటి పట్టా అందుకున్న తర్వాత పేదలకు ప్రభుత్వం ఇళ్ల మంజూరు పత్రాలు జారీచేస్తోంది. చేతికి అందిన ఇంటి పట్టాను చూసి సంతోషిస్తున్న సమయంలోనే ఇల్లు మంజూరు పత్రం కూడా చేతుల్లోకి చేరడంతో సొంతింటి కల త్వరలో నెరవేరుతుందని వారు సంతోషిస్తున్నారు. రాష్ట్రంలో పేదలకు మొదటి విడత 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఇప్పటివరకు రెండులక్షల మందికిపైగా లబ్ధిదారులకు గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఇళ్ల మంజూరు పత్రాలు జారీచేశారు. ఇల్లు మంజూరైనవారందరికీ పట్టా అందిన వారంలోగా ఇంటి మంజూరు పత్రం ఇచ్చేలా అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. అంతేకాకుండా ఇంటి నిర్మాణానికి సంబంధించి అవగాహన కోసం ప్రతి లబ్ధిదారు పేరిట ప్రత్యేకంగా పాస్‌పుస్తకాన్ని ముద్రించారు. లబ్ధిదారులకు ఏమైనా ఇబ్బందులుంటే తెలియజేసేందుకు అందులో టోల్ ఫ్రీ నంబరు 1902ను ముద్రించారు. పాస్ పుస్తకంలో వివరాలు ఇలా.. ఇంటి నమూనా, వలంటీర్లు, సంక్షేమ, విద్య అసిస్టెంట్, వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ల విధులు, ఇంటి నిర్మాణదశలు, నిర్మాణ సామగ్రి, దశల వారీగా దేనికి ఎంత చెల్లించాలనే వివరాలను పాస్‌పుస్తకంలో ముద్రించారు. ఉపాధి హామీ పథకం కింద 90 రోజుల పని దినాలు, ఆయా దశల్లో కూలీలకు ఇచ్చే మొత్తం, తుది మెరుగుల వరకు చెల్లింపుల వివరాలు పొందుపరచారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామగ్రిని మార్కెట్ ధర కంటే తక్కువకే లబ్ధిదారుల సమ్మతి మేరకు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ దశల వారీగా అందజేసే నిర్మాణ సామగ్రి, నగదు వివరాలు లబ్ధిదారుతో ధ్రువీకరించుకుని పాసుపుస్తకంలో నమోదు చేస్తారని తెలిపారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన అధికారుల మొబైల్ నంబర్లు, లబ్ధిదారుకు తన ఇంటి ప్రస్తుత స్థితి వరకు అందిన నగదు, సామగ్రి తదితర వివరాలు తెలియజేసేందుకు వీలుగా పాస్ పుస్తకాన్ని ముద్రించారు. -
మంత్రి సచిన్‌తో పద్మశాలీల భేటీ
సాక్షి, ముంబై: తమ సంస్థ గదికి నామమాత్రపు అద్దె వసూలు చేయాలని కోరుతూ ‘పద్మశాలి సమాజ సుధారక మండలి’ కి చెందిన సభ్యులు గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి సచిన్ అహిర్‌తో భేటీ అయ్యారు. మంత్రాలయ ఎదురుగా ఉన్న ఆయన విశ్రాంతి గృహంలో మంగళవారం ఈ బృందం కలిసి వినతి పత్రం అందజేసింది. నగరంలో కొన్ని ప్రముఖ ప్రార్థన మందిరాలకు, సేవా సంస్థలకు ప్రభుత్వం నామమాత్రపు అద్దె రూపాయి చొప్పున వసూలు చేస్తోంది. ఇదే తరహాలో తమ సంస్థ గదికి నామమాత్రపు అద్దె వసూలు చేసేలా ప్రజా పనులశాఖకు సూచించాలని కోరుతూ అహిర్‌కు విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన సానుకూలంగా వ్యవహరించారు. వచ్చే శాసన సభ ఎన్నికలలోపే ఈ సమస్య పరిష్కరించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అహిర్‌ను కలిసిన ఈ బృందంలో ట్రస్టీలు భోగ సహదేవ్, గాజెంగి రమేశ్, ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, జిందం భాస్కర్, సురేశ్ సురుకుట్ల, గుజ్జేటి గంగాధర్, వేముల మనోహర్, అల్లె శంకరయ్య తదితర సభ్యులు ఉన్నారు.