యజ్ఞంలా ఇళ్ల నిర్మాణం: సీఎం జగన్‌ | CM Jagan Says Emergency measures to not hurt the economy with Covid | Sakshi
Sakshi News home page

యజ్ఞంలా ఇళ్ల నిర్మాణం: సీఎం జగన్‌

Published Wed, Apr 28 2021 3:34 AM | Last Updated on Wed, Apr 28 2021 5:03 PM

CM Jagan Says Emergency measures to not hurt the economy with Covid - Sakshi

‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: పేదలకు సంబంధించిన అన్ని ఇళ్ల నిర్మాణ పనులను మే 31 నాటికి మొదలు పెట్టాల్సిందేనని, ఉద్యమ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేలా కలెక్టర్లు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒకవైపు కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూనే ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా చర్యలు చేపట్టడం అత్యవసరమని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున గృహ నిర్మాణాల ద్వారా సిమెంట్, ఇసుక, ఐరన్‌ వినియోగం పెరిగి ఎకానమీ వృద్ధి చెందుతుందని, మరోవైపు సొంతిళ్ల నిర్మాణం ద్వారా పేదలకు ఇంటివద్దే స్థానికంగా పనులు దొరుకుతాయన్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థ మందగించకుండా ప్రజలకు ఉపాధి కల్పించవచ్చన్నారు.

ఈ నేపథ్యంలో పెండింగ్‌ ఇళ్ల స్థలాల పంపిణీని ఎట్టి పరిస్థితుల్లోనూ పక్షం రోజుల్లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. టెండర్లు పూర్తయిన 839 లే అవుట్లలో పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. తొలి దశలో చేపట్టిన 14.89 లక్షల ఇళ్లకుగానూ ఇప్పటికే చాలావరకు మొదలయ్యాయని, మిగతావి కూడా మే 31 నాటికి కచ్చితంగా మొదలు కావాల్సిందేనని స్పష్టం చేశారు. పనుల పురోగతిపై సమీక్షకు మండల, మునిసిపల్, జిల్లా, డివిజన్‌ స్థాయిల్లో సీనియర్‌ అధికారులను నియమించాలని సూచించారు.

దరఖాస్తుదారుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ నిర్దేశించిన ప్రకారం 90 రోజుల్లోగా ఇంటి స్థలం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా సీఎం మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉపాధి హామీ పనులు (లేబర్‌ బడ్జెట్‌), గ్రామ సచివాలయాల భవనాలు, ఆర్బీకేల భవనాలు, డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్, ఏఎంసీయూ, బీఎంసీయూ, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాలు, స్పందన సమస్యల పరిష్కారంపై సీఎం మార్గనిర్దేశం చేశారు. వివరాలు ఇవీ..

ఇళ్ల స్థలాల పట్టాలు
రాష్ట్రంలో మొత్తం 30,28,346 ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 28,54,983 పట్టాల పంపిణీ జరిగింది. ఇది 94 శాతం కాగా ఇంకా 1,73,363 ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాల్సి ఉంది. మొత్తం 17,053 జగనన్న కాలనీల్లో 16,450 చోట్ల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ పూర్తయింది. నెల్లూరు, గుంటూరు, విజయనగరం, వైఎస్సార్‌ కడపతోపాటు ఉభయ గోదావరి జిల్లాలలో పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ 15 రోజుల్లో పూర్తి చేయాలి.

వారికోసం వేగంగా భూ సేకరణ..
ఇళ్ల స్థలాల కోసం మొత్తం 5,48,690 దరఖాస్తులు రాగా 51,859 మంది అర్హులని గుర్తించారు. మరో 2,21,127 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీఆర్వోలు, తహసీల్దార్లు, మునిసిపల్‌ కమిషనర్లు, సబ్‌ కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్ల వద్ద దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అర్హులుగా గుర్తించిన 51,859 మందిలో 14,410 మందికి ఇప్పుడున్న లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయవచ్చు. మరో 6,004 మందికి ప్రభుత్వ భూముల్లో కొత్తగా వేస్తున్న లేఅవుట్లలో ఇవ్వనుండగా 31,445 మంది కోసం కొత్తగా భూసేకరణ జరపాల్సి ఉంది. 31,445 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు భూసేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ లక్ష్యం మేరకు 90 రోజుల్లోగా ఇంటి స్థలం ఇవ్వాలి.

ఇళ్ల నిర్మాణం..
తొలి విడతలో సమగ్ర ప్రాజెక్టు నివేదికలు పూర్తి కాకపోవడంతో 71 వేల మందికి ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయలేదు. ప్రత్యామ్నాయ డీపీఆర్‌లు సిద్ధం చేసి పంపాలి. ప్లాట్ల డీ మార్కింగ్‌ లేకపోవడం, సరిహద్దు రాళ్లు పాతకపోవడం వల్ల 742 లేఅవుట్లలో 1.46 లక్షల ప్లాట్ల జియో ట్యాగింగ్‌ జరగలేదు. ఇవన్నీ వెంటనే పూర్తి చేయాలి. ఏపీ హౌసింగ్‌ వెబ్‌సైట్‌లో లబ్ధిదారుల నమోదు కేవలం 71 శాతం వరకు పూర్తయింది. మిగతాది పూర్తి చేయాలి. నాన్‌ యూఎల్‌బీలలో ఉపా«ధి హామీ కింద జాబ్‌ కార్డుల మ్యాపింగ్‌ కూడా 75 శాతమే పూర్తి అయింది. మిగతాది పూర్తి చేయాలి. వీటన్నింటినీ మే 15 నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాలి.

లేఅవుట్లలో నీటి సరఫరా, విద్యుదీకరణ..
మొదటి దశలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన 8,905 లేఅవుట్లలో 8,668 లేఅవుట్లలో నీటి సరఫరా చేయాల్సి ఉంది. వాటిలో 6,280 లేఅవుట్లలో పనులు మొదలు కాగా 1,532 లేఅవుట్లలో పనులు పూర్తయ్యాయి. మిగిలిన లేఅవుట్లలో కూడా పనులు పూర్తయ్యేలా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించాలి. పెండింగ్‌లో ఉన్న 1,549 లేఅవుట్లలో టెండర్లు పూర్తి చేయాలి. టెండర్లు పూర్తి అయిన  839 లేఅవుట్లలో పనులు వెంటనే మొదలు పెట్టాలి. 

గ్రామ సచివాలయాల భవనాలు..
10,929 గ్రామ సచివాలయాల నిర్మాణాలు మొదలు కాగా ఇప్పటివరకు 6,057 భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. మరో 1,035 భవనాల నిర్మాణం తుది దశలో ఉండగా 613 భవనాల శ్లాబ్‌ పనులు పూర్తయ్యాయి. నెల్లూరు, కృష్ణా, అనంతపురం జిల్లాలలో చాలా జాప్యం జరుగుతోంది. కడప, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో కూడా పనులు ఆలస్యం అవుతున్నాయి. నిర్దేశించుకున్న ప్రకారం అన్ని గ్రామ సచివాలయాల భవనాలు వచ్చే జూన్‌ చివరి నాటికి పూర్తి చేయాలి.

ఏఎంసీయూ, బీఎంసీయూల నిర్మాణం
రాష్ట్రంలో మొత్తం 9,899 బీఎంసీయూల అవసరం ఉండగా 9,538 భవనాల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులు మంజూరయ్యాయి. తొలిదశలో చేపట్టిన 2,633 భవనాలతో సహా మొత్తం 4,840 భవనాల పనులు మొదలయ్యాయి. తొలిదశ బీఎంసీయూలను జూన్‌ 30 నాటికి పూర్తి చేయాలి. రాష్ట్రంలో అమూల్‌ ఇప్పటికే పాల సేకరణ మొదలు పెట్టింది.

వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్‌లు..
రాష్ట్రంలో 560 వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌ అవసరం ఉండగా ఇప్పటికే ఉన్న 205 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో మరమ్మతులు చేపట్టి అభివృద్ధి చేయాల్సి ఉంది. కొత్తగా 353 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించాల్సి ఉంది. వాటిలో 311 భవనాల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా మిగిలిన వాటి టెండర్లు పూర్తి చేయాల్సి ఉంది.

రైతు భరోసా కేంద్రాలు
10,408 భవనాల నిర్మాణానికి అనుమతి రాగా కేవలం 2,649 మాత్రమే పూర్తయ్యాయి. 139 భవనాల పనులు తుదిదశలో ఉండగా 640 భవనాల శ్లాబ్‌ పనులు పూర్తయ్యాయి. కృష్ణా, విశాఖపట్నం, అనంతపురంతో పాటు కడప, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలలో పనులు ఆలస్యం అవుతున్నాయి. ఈ భవనాల పనులన్నీ ఈ ఏడాది జూలై నాటికి పూర్తి కావాలి.

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్స్‌ (రూరల్‌)...
8,585 భవనాలకు గానూ ఇప్పటివరకు 1,755 భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. మరో 63 భవనాల పనులు తుదిదశలో ఉండగా 400 భవనాల శ్లాబ్‌ పనులు పూర్తయ్యాయి . 4,118 భవనాల పనులు శ్లాబ్‌ వేసే వరకు జరిగాయి. అన్ని క్లినిక్‌ల నిర్మాణం ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి పూర్తి కావాలి. అనంతపురం, విశాఖపట్నం, కర్నూలు, కడప, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలలో పనులు ఆలస్యం అవుతున్నాయి.

అంగన్‌వాడీ కేంద్రాలు
మొత్తం 55,607 అంగన్‌వాడీ కేంద్రాలలో 27,438 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. నాడు–నేడు మొదటి దశలో కొత్తగా 4706 అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు ప్రస్తుతమున్న 3341 అంగన్‌వాడీల స్థాయి పెంచే పనులు కొనసాగుతున్నాయి. 3928 భవనాల నిర్మాణ పనులు సాగుతున్నాయి. లక్ష్యానికి అనుగుణంగా వచ్చే జూన్‌ 30 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాలలో పనుల్లో జాప్యం జరుగుతోంది. ఆయా జిల్లాల కలెక్టర్లు వాటిపై దృష్టి పెట్టాలి.

స్పందన సమస్యలు
స్పందన కార్యక్రమంలో ఇప్పటివరకు 2,19,81,131 సర్వీస్‌ రిక్వెస్టులు రాగా 2,14,78,165 పరిష్కరించారు. (97.71శాతం). నిర్దేశించిన గడువులోగా 1,83,68,988 దరఖాస్తులను పరిష్కరించగా కాస్త ఆలస్యంగా 31,09,166 అర్జీలను పరిష్కరించారు. పెన్షన్లు, రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ, ఇళ్ల స్థలాలకు సంబంధించిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి.   

మోడల్‌ హౌస్‌లు..
ప్రతి లేఅవుట్‌లో మోడల్‌ హౌస్‌ నిర్మించాలి. ఇప్పటికే 4,374 లేఅవుట్లలో మోడల్‌ హౌస్‌ల నిర్మాణం మొదలు కాగా మిగిలిన 4,500 లేఅవుట్లలో పనులు మొదలవ్వాలి.

ఉపాధి హామీ పనులు..
కోవిడ్‌ నేపథ్యంలో ఉపాధి హామీ కీలకం. మనకు 20 కోట్ల పని దినాలకు అనుమతి ఉండగా గత ఏడాది పెంచారు. ఏప్రిల్‌లో 2.50 కోట్ల పని దినాలు లక్ష్యం కాగా ఈనెల 26 నాటికి 1.89 కోట్లే సాధించగలిగాం. వచ్చే రెండు నెలల్లో ప్రతి జిల్లాలో కోటి పని దినాలు సాధించి తీరాలి. నెల్లూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో వేజ్‌ కాంపోనెంట్‌ ఇంకా పెరగాలి.

ఈనెల, వచ్చే నెల కార్యక్రమాలు ఇవీ
ఏప్రిల్‌ 28: జగనన్న వసతి దీవెన
మే 13: రైతు భరోసా
మే 18: మత్స్యకార భరోసా
మే 25: 2020 ఖరీఫ్‌ ఇన్సూరెన్స్‌ 

డబ్బుల చెల్లింపు
సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, బొత్స సత్యనారాయణ, చీఫ్‌ కమిషనర్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయకుమార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement