
న్యూఢిల్లీ: వివాదాస్పద బాలీవుడ్ చిత్రం పద్మావత్ ఈ నెల 25న దేశవ్యాప్తంగా విడుదలవడానికి మార్గం సుగమమైంది. ఈ చిత్ర ప్రదర్శనపై నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో(రాజస్తాన్, గుజరాత్, హరియాణా, మధ్యప్రదేశ్) విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఇతర రాష్ట్రాలు పద్మావత్‌పై నిషేధం విధించకుండా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలిచ్చింది. పద్మావత్ విడుదలైన తరువాత శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత రాష్ట్రాలదే అని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చికి వాయిదా వేసింది.
చిత్ర నిర్మాతల తరఫున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, ముకుల్ రోహత్గీ వాదిస్తూ చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చిన తరువాత నిషేధం విధించే అధికారం రాష్ట్రాలకు లేదని అన్నారు. గుజరాత్, హరియాణా, రాజస్తాన్ ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. పద్మావత్ విడుదలైతే ఆ రాష్ట్రాల్లో శాంతి భద్రతల సమస్యలు నెలకొంటాయని నిఘా వర్గాల సమాచారం ఉందని, సెన్సార్ బోర్డు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండానే విడుదలకు అనుమతిచ్చిందని తెలిపారు. రాష్ట్రాలు ‘సూపర్ సెన్సార్ బోర్డు’లా వ్యవహరించరాదని రోహత్గీ అభిప్రాయపడ్డారు.
పద్మావత్‌ను ఆడనీయం: కర్నిసేన
సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే రాజ్‌పుత్ కర్నిసేన కార్యకర్తలు, హిందూ అతివాదులు విధ్వంసానికి దిగారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో కర్నిసేన కార్యకర్తలు ఓ సినిమా థియేటర్‌పై దాడికి పాల్పడి, పద్మావత్ పోస్టర్లను చించేశారని పోలీసులు తెలిపారు. పద్మావత్ ప్రదర్శనను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న రాజ్‌పుత్ వర్గం కర్నిసేన ఈ చిత్ర విడుదలను అడ్డుకుంటామని పునరుద్ఘాటించింది. దేశవ్యాప్తంగా ఈ చిత్ర ప్రదర్శనను అడ్డుకునేలా సహకరించాలని సంస్థ నాయకుడు స్వచ్ఛంద సంస్థలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment