
వెంకయ్య భావోద్వేగం
న్యూఢిల్లీ: ఈరోజు నుంచి తన పాత్ర మారుతుందని, కొత్త పాత్ర పోషించబోతున్నానని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఇష్టపూర్వకంగానే ఉపరాష్ట్రపతి ఎన్నికల పోటీలో నిలిచినట్టు వెల్లడించారు. తనకు మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఉపరాష్ట్రపతి పదవి గౌరవాన్ని కాపాడతానని, పార్టీలకతీతంగా పనిచేస్తానని హామీయిచ్చారు. రాజ్యాంగ నిబంధనలు, ఆదర్శాలకు లోబడే పనిచేస్తానని అన్నారు. ఇకపై పార్టీ వ్యహారాల గురించి మాట్లాడే అవకాశం ఉండదని వ్యాఖ్యానించారు. వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చానని, తనకు ఘనమైన చరిత్ర లేదన్నారు.
ఏడాదిన్నర వయసులోనే తల్లిని కోల్పోయానని, తల్లిలాంటి పార్టీ తనను ఇంతటి వాడిని చేసిందని పేర్కొన్నారు. పార్టీతో బంధం తెంచుకోవడంతో బాధతో బావోద్వేగానికి గురయినట్టు చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రచారం చేసే ఆలోచన లేదని వెల్లడించారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్నానని గుర్తు చేశారు. తనమై నమ్మకం, విశ్వాసం ఉంచి తనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాకు వెంకయ్య ధన్యవాదాలు తెలిపారు.