పాక్ హైకమిషనర్‌కు భారత్ సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు ఉగ్రవాదం విషయంలో దాయాది పాకిస్తాన్‌పై భారత్ చాలా సీరియస్‌గా ఉంది. గత ఆగస్ట్ 26న జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి విషయంపై పాకిస్తాన్‌కు భారత విదేశాంగమంత్రిత్వశాఖ సమన్లు జారీ చేసింది. జైషే మహమ్మద్ ఉగ్రవాదులు చేసిన దాడిలో 8మంది భారత భద్రతా సిబ్బంది మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే. పాక్ హైకమిషనర్ హైదర్ షా మంగళవారం నోటీసులు అందుకున్నారు. ఈ విషయాన్ని విదేశాంగశాఖ ప్రతినిధి బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
పాక్‌కు చెందిన వ్యక్తులే ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌లో పనిచేస్తున్నారని, ఇందువల్ల ముఖ్యంగా భారత్ సరిహద్దుల్లో ఉగ్రదాడులు జరుగుతున్నాయని సమన్లలో విదేశాంగశాఖ పేర్కొంది. అదే విధంగా గత ఆగస్ట్‌లో 16, 17 తేదీలలో రాత్రివేళ జమ్ములోకి ప్రవేశించి దాడులకు పథకం రూపొందించిన కొందరు జేషే ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు హైదర్ షాకు వివరించింది. పాక్ భూభాగంలో ఎలాంటి ఉగ్రసంస్థలకు గానీ, ఉగ్రవాదులకుగానీ చోటివ్వరాదని హెచ్చరించింది. ఉగ్రశక్తులకు చోటు కల్పించినందువల్లే సరిహద్దులోని జమ్ముకశ్మీర్‌లోకి పాక్ ఉగ్రవాదులు చొరబడి దాడులకు పాల్పడుతున్నారని ఇకనైనా చర్యలు తీసుకోవాలని భారత్ గట్టిగా సూచించింది.
పుల్వామాలోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌పై జైషే ఉగ్రవాదులు చేసిన దాడిలో ఓ సీఆర్‌పీఎఫ్ జవాను సహా 8 మంది సిబ్బంది చనిపోయారని.. ఈ ఉగ్రదాడిపై సత్వరం విచారణ చేపట్టాలని కోరింది. ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సులో తాలిబాన్, ఐసిస్, అల్‌కాయిదాతోపాటుగా హక్కానీ నెట్‌వర్క్, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రసంస్థలపై కలిసి పోరాడాలని బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు జియామెన్ డిక్లరేషన్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పాక్.. తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం లేదని బుసలుకొట్టింది. అయితే పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి ఏం సమాధానం చెబుతారంటూ పాక్ హైకమిషనర్‌ను భారత్ ప్రశ్నించింది. పాక్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.