ఆగని పాక్ దురాగతాలు
సరిహద్దులో కొనసాగుతున్న పాక్ కాల్పులు.. దీటుగా బదులిస్తూ ప్రమాదవశాత్తూ మరణించిన జవాను
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ బలగాల దురాగతాలు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శుక్రవారం సాయంత్రం నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరపగా..భారత్ బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ బీఎస్‌ఎఫ్ జవాను నితిన్ సుభాష్ ప్రాణాలు కోల్పోయాడు. మచ్చిల్ సెక్టార్ సరిహద్దులో ఈ సంఘటన చోటుచేసుకుంది. పాక్ బలగాల దాడుల్ని తిప్పికొట్టేందుకు శుక్రవారం గ్రనేడ్ లాంఛర్ తరహా ఆయుధం ప్రయోగిస్తుండగా... ఒక్కసారిగా పేలడంతో సుభాష్ తీవ్రంగా గాయపడ్డాడని బీఎస్‌ఎఫ్ ఐజీ(కశ్మీర్) వికాశ్ చంద్ర పేర్కొన్నారు.
వెంటనే సుభాష్‌ను ఆస్పత్రికి తరలించామని, అక్కడే చికిత్స పొందుతూ మరణించాడని చెప్పారు. పాక్ కాల్పుల్లో సుభాష్ మరణించాడంటూ అంతకుముందు బీఎస్‌ఎఫ్ పేర్కొనడం గమనార్హం. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాకు చెందిన సుభాష్ 2008లో బీఎస్‌ఎఫ్‌లో చేరాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. దీపావళి అనంతరం ఇంటికి వెళ్లాలని సుభాష్ ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఇంటికి ఫోన్ చేసి దీపావళి శుభాకాంక్షలు కూడా చెప్పాడు. అంతలోనే ఆ కుటుంబం ఊహించని వార్త వినాల్సి వచ్చింది. మరోవైపు పాకిస్తాన్ రేంజర్లు శనివారం ఆర్‌ఎస్ పురా, కతువా, కెరాన్ సెక్టార్లలో అంతర్జాతీయ సరిహద్దు వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ఈ కాల్పుల్లో ఒక జవాను, మహిళ గాయపడ్డారు. పాక్ కాల్పుల్ని భారత బలగాలు గట్టిగా తిప్పికొట్టాయి.
మన్‌దీప్ స్వగ్రామంలో విషాదం
కశ్మీర్‌లోని మచ్చిల్ సెక్టార్‌లో భారత జవాను మన్‌దీప్‌సింగ్‌ను హత్య చేసి శరీరాన్ని ముక్కలు చేసిన ఉగ్రవాదుల కిరాతకంపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్నాయి. ఈ సంఘటనను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ మాట్లాడుతూ అనైతిక చర్యగా అభివర్ణించారు. మన్‌దీప్ స్వగ్రామమైన హరియాణా రాష్ట్రం కురుక్షేత్ర జిల్లా ఆంతేహ్రిలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. రెండేళ్ల క్రితమే మన్‌దీప్‌కు వివాహమైంది. అతని భార్య ప్రేర్న హరియాణా పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. పాకిస్తాన్‌కు భారత్ దళాలు గట్టిగా బుద్ధి చెప్పాలని, అప్పగించిన పనిని నిర్వర్తించే క్రమంలో తన కొడుకు ప్రాణం త్యాగం చేశాడంటూ మన్‌దీప్ తండ్రి పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్నందుకు పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పాలని ప్రేర్న డిమాండ్ చేసింది.