సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో భారత్‌లో తమ రాయబారి సొహైల్ మహ్మద్‌ను స్వదేశానికి తిరిగిరావాలని పాకిస్తాన్ ఆదేశించింది. పుల్వామా ఘటన అనంతర పరిణామాలపై చర్చించేందుకే సొహైల్‌ను పిలిపించినట్టు పాక్ పేర్కొంది. భారత్‌లో తమ హైకమిషనర్ సొహైల్ అహ్మద్‌ను చర్చల నిమిత్తం పాకిస్తాన్ పిలిపించామని, ఆయన సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరారని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి డాక్టర్ మహ్మద్ ఫైసల్ ట్వీట్ చేశారు.
కాగా పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించిన ఉదంతంపై పాక్ హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసిన భారత్ ఆత్మాహుతి దాడిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దాడికి బాధ్యత వహించిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌పై పాకిస్తాన్ తక్షణమే చర్యలు చేపట్టాలని, తమ భూభాగం నుంచి ఉగ్రకార్యకలాపాలకు పాల్పడే సంస్థలు, వ్యక్తులను కట్టడి చేయాలని కోరింది. దాడి జరిగిన మరుసటి రోజు పాక్‌లో భారత రాయబారిని సంప్రదింపుల కోసం ఢిల్లీకి పిలిపించారు.
Comments
Please login to add a commentAdd a comment