
ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా దీటుగా బదులిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి ఘటనకు సంబంధించి తాము యుద్ధానికి సన్నద్ధంగా లేమని భారత్ మాత్రం కయ్యానికి కాలుదువ్వుతోందని పాక్ సైనిక దళాల ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటనలో పాకిస్తాన్ ప్రమేయం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
కాగా ఈ ఆత్మాహుతి దాడికి తెగబడింది తామేనని పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఘటనలో పాకిస్తాన్ గూఢచర్య సంస్ధ ఐఎస్‌ఐ హస్తం ఉందని భారత్ ఆరోపిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమైతే భారత్ వెనుకాడబోదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తేల్చిచెప్పారు.
పుల్వామా దాడికి భారత్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో తాను చెప్పలేనని, భద్రతా దళాలకు ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారన్నారు. ఇక పాక్ దుశ్చర్యలను ఎండగడుతూ అంతర్జాతీయ సమాజంలో ఆ దేశాన్ని ఏకాకిని చేసేలా భారత్ పలు దౌత్య చర్యలు చేపట్టింది. పాక్ నుంచి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో పాటు సింధూ జలాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment