
పౌరసత్వ నిరసన కార్యక్రమంలో ’పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేసిన అమూల్యకు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆరోపించారు.
బెంగుళూరు : పౌరసత్వ నిరసన కార్యక్రమంలో ’పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేసిన అమూల్యకు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆరోపించారు. విచారణ అనంతరం యువతికి శిక్ష తప్పదని హెచ్చరించారు. అమూల్య వంటి యువతను తప్పుదోవ పట్టిస్తున్న వారికి కూడా కఠిన శిక్ష తప్పదని అన్నారు. ఆమె వెనుక ఎవరెవరున్నారో వెల్లడవుతుందని, తీవ్రవాదాన్ని పెంచి పోషించే సంస్థలకు తగిన బుద్ధి చెబుతామని అన్నారు. ఆయన బెంగుళూరులో మీడియాతో మాట్లాడుతూ.. ‘యువతి ప్రవర్తనపై ఆమె తండ్రే ఆగ్రహంగా ఉన్నాడు. ఆమెకు తగిన శిక్ష పడాలని, బెయిల్ కూడా రాకుండా చేయండని అన్నాడు. తనను రక్షించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయనని చెప్తున్నాడు. ఆ యువతికి నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయనేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఇక బెంగుళూరు ఫ్రీడంపార్క్‌లో గురువారం జరిగిన పౌరసత్వ సవరణ చట్టం నిరసన కార్యక్రమంలో అమూల్య లియోన్ అనే యువతి ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అంటూ నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది. అమూల్యను 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సహా పలువురు ఈ ర్యాలీకి హాజరయ్యారు.