ఇక భారతీయుడిగా పాక్ సింగర్
న్యూఢిల్లీ: ప్రముఖ పాకిస్థాన్ గాయకుడు అద్నాన్ సమీ ఇక భారతీయుడు కానున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతీయ పౌరసత్వం ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. జనవరి 1 నుంచి ఆయన అధికారికంగా భారతీయ పౌరుడిగా కొనసాగుతారని తెలిపింది. ఇటీవలె ఆయనకు శాశ్వత వీసాను కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. తనకు భారతీయ పౌరసత్వం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సమీ గతంలోనే దరఖాస్తు చేసుకోగా రెండేళ్ల నుంచి దానిని అధికారులు తిరస్కరిస్తూ వచ్చారు.
ఇటీవలె ఆ దరఖాస్తును తిరిగి విదేశాంగ శాఖకు పంపించగా దానికి తాజాగా ఆమోద ముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. పాకిస్థాన్లోని లాహోర్ కు చెందిన అద్నాన్ తొలిసారి 2001, మార్చి 13న విసిటర్ వీసాపై భారత్లో అడుగుపెట్టాడు. అప్పుడు ఇస్లామాబాద్లోని భారతీయ హైకమిషన్ ఈ వీసాను మంజూరు చేసింది. కానీ, పాకిస్థాన్ మాత్రం ఆయనకు పాస్ పోర్టును 2010 మే 27న ఇవ్వగా దానికి 2015, మే 6తో కాలపరిమితి ముగిసింది. తిరిగి పాస్ పోర్టును ఆయన రెనివల్ కూడా చేసుకోలేదు. ఆ తర్వాత మానవత దృక్పథంతో ఆలోచించి తనకు భారత్లోనే చట్టబద్దంగా ఉండేందుకు అనుమతించాలని కోరుతూ సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆమోదం లభించింది. దీంతో ఇక అద్నాన్ కూడా భారతీయుడిగా మారనున్నాడు.