బలూచ్ నాయకుడికి భారత పౌరసత్వం?
న్యూఢిల్లీ: పాకిస్తాన్ వెలివేసిన బలూచ్ రిపబ్లికన్ పార్టీ (బీఆర్పీ) వ్యవస్థాపకుడికి భారత్ పౌరసత్వం ఇవ్వనుందా?. అవుననే అంటోంది పాకిస్తాన్ మీడియా. ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో తలదాచుకుంటున్న బలూచ్ నాయకుడు బ్రహుందఘ్ బుగ్తీకి భారత్ పౌరసత్వం ఇవ్వనున్నట్లు పాక్ కు చెందిన జియో న్యూస్ చానెల్ ఓ కథనం ప్రసారం చేసింది. బ్రహుందఘ్ తో పాటు అతనికి నమ్మకస్తులైన షేర్ మహమ్మద్ బుగ్తీ, అజీజుల్లా బుగ్తీలకు కూడా భారత్ పౌరసత్వాన్ని ఇవ్వనున్నట్లు సదరు చానెల్ పేర్కొంది.
కాగా, దేశ వ్యతిరేక చర్యలు చేస్తున్నారంటూ బ్రహుందఘ్, ఆయన పార్టీని పాకిస్తాన్ బహిష్కరించింది. బెలూచిస్తాన్ లో మానవహక్కుల ఉల్లంఘన అంశాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ లేవనెత్తక ముందే.. భారత పౌరసత్వంపై అధికారులు బ్రహుందఘ్ ను సంప్రదించినట్లు మీడియా సంస్ధ పేర్కొంది. భవిష్యత్ లో భారతీయ మీడియా ద్వారా పాకిస్తాన్ పై పోరాటం చేస్తామని, బలూచ్ పై భారత ప్రధాని నరేంద్ర మోదీ చూపుతున్న దయకు ధన్యవాదాలని ఓ బీఆర్పీ నేత జియోతో చెప్పినట్లు వెల్లడించింది.
ప్రత్యర్ధులు ఎమనుకున్నా బీఆర్పీ మోదీకి మద్దతు తెలుపుతుందని నేత పేర్కొన్నట్లు తెలిపింది. ఈ నెల 18,19 తేదీల్లో బీఆర్పీ నేతలతో సమావేశం అనంతరం బ్రహుందఘ్ జెనీవా నుంచి భారత పౌరసత్వానికి దరఖాస్తు చేస్తారని జియో పేర్కొంది. దాదాపు 16 మంది బీఆర్సీ నేతలు బ్రహుందఘ్ ను స్విట్జర్లాండ్ లో కలవనున్నట్లు తెలిపింది. వీరిలో ఏడుగురు జర్మనీ, లండన్, నార్వే, స్వీడన్, స్విట్జర్లాండ్ ల నుంచి హాజరవుతారని చెప్పింది. సమావేశంలో భారత్ సహాయం తీసుకోవాలా? వద్దా? అనే అంశంపైనే చర్చించనున్నట్లు పేర్కొంది.
దలై లామా, షేక్ ముజీబ్-ఉర్-రెహమాన్ లాంటి వారికి భారత్ నీడనిచ్చింది, బ్రహుందఘ్, అతని బృందానికి భారత్ ఆశ్రయాన్ని కల్పిస్తుందని జియో కథనాన్ని ప్రచురించింది. 15వేలకు మంది బుగ్తీలు ఆప్ఘనిస్తాన్ లో చిక్కుకుపోగా, రెండు వేలకు మంది పైగా వివిధ యూరోపియన్ దేశాల్లో తలదాచుకుంటున్నారు. వారందరూ పౌరసత్వానికి దరఖాస్తు చేశారని, అయితే అవన్నీ పెండింగ్ లో ఉన్నాయని పేర్కొంది.
2006లో తన తాతయ్య హత్య అనంతరం బ్రహుందఘ్ ప్రాణాలు కాపాడుకోవడం కోసం సొంత ఊరు డేరా బుగ్తీని వదిలి ఆప్ఘనిస్తాన్ వెళ్లిపోయారు. 2010లో అక్కడి నుంచి కుటుంబంతో పాటు స్విట్జర్లాండ్ కు వెళ్లినట్లు జియో పేర్కొంది. స్విట్జర్లాండ్ పౌరసత్వం కోసం బుగ్తీ దరఖాస్తు చేసుకోవడంతో.. పాక్ ప్రభుత్వం స్విట్జర్లాండ్ పై ఒత్తిడిని తీసుకొచ్చింది. దీంతో స్విస్ తనకు పౌరసత్వాన్ని ఇవ్వదని తెలుసుకున్న బ్రహుందఘ్ భారత్ సాయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది.