కాశ్మీర్‌పై జోక్యం చేసుకోండి.. | Pakistan's letter to the chief of the United Nations | Sakshi
Sakshi News home page

కాశ్మీర్‌పై జోక్యం చేసుకోండి..

Published Mon, Oct 13 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM

కాశ్మీర్‌పై జోక్యం చేసుకోండి..

కాశ్మీర్‌పై జోక్యం చేసుకోండి..

ఐక్యరాజ్యసమితి చీఫ్‌కు పాకిస్థాన్ లేఖ
భారత్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపణ
తమ పౌరులు భారీ సంఖ్యలో మరణించారని లేఖలో పేర్కొన్న పాక్
కాశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణకోసం ఎదురుచూస్తున్నామని వ్యాఖ్య
అంతర్జాతీయ సరిహద్దు, ఎల్‌వోసీ వెంబడి మళ్లీ తెగబడిన పాక్ దళాలు
15 ఔట్‌పోస్టులు, గ్రామాలపైనా భారీగా కాల్పులు
ముగ్గురు పౌరులకు గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

 
ఇస్లామాబాద్/జమ్మూ: కొద్దిరోజులుగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్థాన్... కాశ్మీర్ అంశంపైకి అంతర్జాతీయంగా దృష్టి మరల్చే యత్నాలను తీవ్రం చేసింది. కాశ్మీర్‌తో సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులపై జోక్యం చేసుకోవాలంటూ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్‌కు లేఖ రాసింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు తోడ్పడాలని విజ్ఞప్తి చేసింది. పాకిస్థాన్ ప్రధాని భద్రత, విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ రాసిన ఈ లేఖను పాక్ విదేశాంగ కార్యాలయం ఆదివారం విడుదల చేసింది. కొద్దివారాలుగా భారత్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, భారీగా కాల్పులకు తెగబడుతోందని ఆ లేఖలో ఆరోపించారు. భారత దళాలు జరిపిన కాల్పుల్లో తమ పౌరులు భారీ సంఖ్యలో మరణించారన్నారు. అక్టోబర్ నెల మొదటి పదిరోజుల్లోనే అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి 22 సార్లు, నియంత్రణ రేఖ వెంబడి 20 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించారని ఆరోపించారు. జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దుల వద్ద కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొందని.. దీనిపై అత్యవసరంగా దృష్టి సారించాలని బాన్‌కీ మూన్‌ను అజీజ్ కోరారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సుదీర్ఘకాలంగా ఈ జమ్మూకాశ్మీర్ వివాదం ఎజెండాగా ఉందని.. అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిపిస్తామనే తీర్మానాలు కూడా చేసినా, ఇంకా ఆ పని చేపట్టలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ఐక్యరాజ్యసమితి సాధారణ సభలోనూ పాక్ ప్రధాని జమ్మూకాశ్మీర్ అంశాన్ని పరిష్కరించాలని కోరారని గుర్తుచేశారు. మరోవైపు భారత్ మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని.. ఇరుదేశాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక చర్చలను కూడా రద్దుచేసుకుందని పేర్కొన్నారు. తాము రాస్తున్న ఈ లేఖను భద్రతా మండలి అధికారిక పత్రంగా అన్ని దేశాల ప్రతినిధులకు సర్క్యులేట్ చేయాలని బాన్‌కీ మూన్‌ను కోరారు. భారత్‌తో ఉన్న అన్ని వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకొనేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందన్నారు.
 
మళ్లీ భారీగా కాల్పులు..

భారత్‌తో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ దళాలు మళ్లీ భారీ ఎత్తున కాల్పులకు తెగబడ్డాయి. శనివారం రాత్రి జమ్మూ జిల్లా పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఆర్నియా, ఆర్‌ఎస్ పుర సెక్టార్లలోని 15 భారత ఔట్‌పోస్టులపై మోర్టార్లు, షెల్‌లతో రాత్రంతా విరుచుకుపడ్డాయి. దీంతోపాటు సరిహద్దు వెంబడి ఉన్న ఆర్నియా పట్టణంతో పాటు కుకుదా కోటే, మహషాకోటే, జబోవాల్, చింగియా దేవీగఢ్ తదితర గ్రామాలపైనా కాల్పులు జరపడంతో... ముగ్గురు పౌరులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో జబోవాల్ గ్రామానికి చెందిన ఒకరి పరిస్థితి విషమంగా ఉందని జమ్మూ జిల్లా మెజిస్ట్రేట్ అజిత్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఉదయం వరకూ కూడా కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇక పూంఛ్ జిల్లాలోని బన్వత్-షాపూర్ సెక్టార్ పరిధిలో నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద కూడా పాక్ దళాలు కాల్పులకు తెగబడ్డాయని ఒక ఆర్మీ అధికారి తెలిపారు. సైనిక ఔట్‌పోస్టులతో పాటు షాపూర్, కిర్ని, బన్వత్, మందార్, కల్సామ్, దోడా గ్రామాలపైనా మోర్టార్లు, షెల్‌లతో దాడికి పాల్పడినట్లు ఆయన చెప్పారు. దీంతో ఐదు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, ఒక ఇల్లు దహనమైందని.. అయితే ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని వెల్లడించారు.
 
 పాకిస్థాన్‌లో అంతర్గత ఉగ్రవాదం నుంచి ప్రపంచదేశాల దృష్టిని కాశ్మీర్ అంశంపైకి మళ్లించేందుకే ఐక్యరాజ్యసమితికి లేఖ రాసిందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేగాకుండా భారత్‌లోకి లష్కరే తొయిబా వంటి ఉగ్రవాద సంస్థల చొరబాటును ప్రొత్సహించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. అంతర్జాతీయంగా భారత్ పలుకుబడి పెరుగుతున్న తరుణంలో.. కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తేవడానికి, భారత ప్రధాని మోదీని పరీక్షించడానికి పాకిస్థాన్ ఐక్యరాజ్యసమితికి లేఖ రాసిందని ప్రముఖ అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు సి.క్రిస్టిన్ ఫెయిర్ పేర్కొన్నారు. భారత్‌లోకి ఇసిస్, అల్‌కాయిదా వంటి సంస్థలకు చెందిన ఉగ్రవాదులు చొరబడడానికి అవకాశం కల్పించేందుకే.. పాకిస్థాన్ తరచూ కాల్పులకు పాల్పడుతోందని ఆర్మీ మాజీ లెఫ్ట్‌నెంట్ జనరల్ హస్నాన్ చెప్పారు. జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో... అక్కడ అస్థిరత సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement