బద్దలైన నీరా రాడియా బండారం !
నీరా రాడియా.. 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో దేశాన్ని కుదిపేసిన పేరు ఇది. కార్పొరేట్ లాబీయిస్ట్ అయిన ఆమె రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, లాబీయిస్టులతో జరిపిన టెలిఫోన్ సంభాషణలు లీకవ్వడం దుమారం రేపింది. తన క్లయింట్లయిన కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకు ఆమె యూపీఏ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులతో లాబీ నడిపింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, రతన్ టాటాకు చెందిన టాటా టెలిసర్వీసెస్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఆమె క్లయింట్లుగా ఉన్నాయి. తమకు అనుకూలురైన వ్యక్తులను కేంద్ర కేబినెట్ లో నియమించేందుకు ఆమె నడిపిన లాబీ వ్యవహారం 'రాడియాగేట్'గా ప్రసిద్ధికి ఎక్కింది. 2జీ స్పెక్ట్రం కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరుపుతుండటంతో ఆమె పేరు ఇటీవల అంతగా వినిపించడం లేదు.
కానీ, తాజాగా 'పనామా పేపర్స్' లీక్ తో బద్దలవుతున్న కుబేరుల బండారంలో నీరా రాడియా పేరు కూడా చేరింది. పనామాకు చెందిన మొస్సాక్ ఫొన్సెకా కంపెనీ పత్రాల్లో ఆమె పేరు కూడా ఉందని తాజాగా ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక వెల్లడించింది. దాదాపు పది దేశాల్లో నీరా రాడియాకు అక్రమ ఆస్తులు ఉన్నట్టు ఐటీ దర్యాప్తు సంస్థలు భావిస్తుండగా.. తాజాగా ఆమెకు విదేశాల్లో ఓ కంపెనీ ఉన్నట్టు 'పనామా పత్రాల' ద్వారా వెల్లడైంది. క్రోన్ మార్ట్ ఇంటర్నేషనల్ గ్రూప్ లిమిటెడ్ పేరిట 1994లో ఓ అంతర్జాతీయ వ్యాపార కంపెనీని రాడియా పేరిట బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ)లో ఫొన్సెకా ఏర్పాటుచేసింది. 2004 జూన్ వరకు ఈ కంపెనీ పత్రాల్లో నీరా రాడియా సంతకాలు చేసినట్టు పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఫొన్సెకా రిజిస్టర్ లో ఈ కంపెనీకి సంబంధించిన రికార్డులు 2009, మార్చ్ 2012నాటివి ఉన్నాయి. ఈ కంపెనీకి సంబంధించిన మొత్తం 232 పత్రాలు లీకయ్యాయి. ఇందులో ఇన్ కార్పొరేషన్ డాక్యుమెంట్స్, రాడియా సహా డైరెక్టర్ల పేరిట ఉన్న షేర్ సర్టిఫికెట్లు సైతం ఉన్నాయి. ఈ పత్రాల్లో రాడియాను బ్రిటిష్ పౌరురాలిగా పేర్కొన్నారు. ఇంకా ఆశ్ఛర్యకరమైన విషయమేమిటంటే క్రౌన్ మార్ట్ ఇంటర్నేషనల్ (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ పేరిట ఆమె లండన్ లో కూడా ఓ వ్యాపార సంస్థను ఏర్పాటుచేసింది.
'జనరల్ బిజినెస్' కోసం అంటూ ఏర్పాటుచేసిన ఈ రెండు కంపెనీల్లో ప్రస్తుతం రాడియా కుటుంబసభ్యులు యజమానులుగా ఉండగా, ఆమె ప్రధాన షేర్ హోల్డర్ గా కొనసాగుతున్నారు. 1992లో ఏర్పాటుచేసిన క్రౌన్ మార్ట్ ఇండియా కంపెనీలో రాడియా తండ్రి ఇక్బాల్ నరైన్ మీనన్ కు ఒక శాతం వాటా ఉండగా, 1995లో లక్ష పౌండ్ల అప్పు కారణంగా ఈ కంపెనీ దివాళా తీసినట్టు ప్రకటించారు. ఈ కంపెనీలో రాడియా కొడుకులు అక్షయ్, ఆకాశ్, కరణ్ లు కూడా వాటాదారులుగా ఉన్నారు. కాగా, నీరా రాడియా బ్రిటిష్ పౌరురాలు అన్న విషయం వాస్తవమేనని, ఆమెకు ప్రస్తుతం యూకే పాస్ పోర్టు కూడా ఉందని ఆమె కార్యాలయం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది.
కొసమెరుపు!
జ్యోతిష్యుల సలహా ప్రకారం నీరా రాడియా తన పేరులో ఆంగ్ల అక్షరం 'ఐ'ని అదనంగా ఇటీవల చేర్చుకున్నారు. కానీ ఫొన్సెకా పత్రాల్లో మాత్రం ఆమె పేరు గతంలో ఉన్న మాదిరిగానే నమోదైంది. గతంలో ఉన్నట్టు (Nira Radia)గానే ఆమె పేరు ఈ పత్రాల్లో కనిపిస్తోంది.