పనామా ప్రకంపనలు: ఆ ముగ్గురు తెలుగోళ్లు! | Panama Papers Part 3, telugu people also listed Offshore entities | Sakshi
Sakshi News home page

పనామా ప్రకంపనలు: ఆ ముగ్గురు తెలుగోళ్లు!

Published Wed, Apr 6 2016 11:29 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

పనామా ప్రకంపనలు: ఆ ముగ్గురు తెలుగోళ్లు!

పనామా ప్రకంపనలు: ఆ ముగ్గురు తెలుగోళ్లు!

పన్ను స్వర్గధామలైన విదేశాల్లో బోగస్ కంపెనీలు పెట్టి.. నల్లడబ్బు దాచుకున్న కుబేరుల బాగోతం ప్రపంచాన్ని కుదిపేస్తూనే ఉంది. 'పనామా పత్రాల' లీకైన వ్యవహారానికి సంబంధించి తాజాగా మూడో జాబితా విడుదలైంది. ఈ మూడో జాబితాలో ముగ్గురు తెలుగువాళ్లతోపాటు పలువురు భారతీయ పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు.

తెలుగువాళ్లు ఎవరంటే..?
మోతూరి శ్రీనివాస్ ప్రసాద్
విదేశీ కంపెనీలు: నాలుగు
స్థలం: బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ)


హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్ ప్రసాద్ కనీసం నాలుగు విదేశీ కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్నట్టు ఫొన్సెకా పత్రాల ద్వారా వెల్లడైంది. 2011లో బీవీఐలో ఈ కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. ప్రసాద్ నందన్ క్లీన్ టెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండటంతోపాటు సికా సెక్యూరిటీస్ లిమిటెడ్ కు కో ఓనర్ గా కొనసాగుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద బయోచమురు ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పినట్టు ఘనత తెచ్చుకున్న ప్రసాద్ పేరిట మరో 12 కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే, బయోడీజిల్ ఎగుమతుల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై 2012 ఏప్రిల్ 2న ఆయన అరెస్టయి.. ప్రస్తుతం బెయిల్ పై విడుదలయ్యారు.

ప్రసాద్ వివరణ: కేవలం ఒక డాలర్ తో ఈ కంపెనీలు స్థాపించాం, విదేశాల్లో వ్యాపారం చేద్దామనే ఆశతో వీటిని పెట్టినప్పటికీ అది కుదరకపోవడంతో ప్రస్తుతం ఆ కంపెనీలన్నీ పనిచేయడం లేదు. వీటిని ప్రస్తుతం మేం నడుపడం లేదు.

భావనాసి జయకుమార్
విదేశీ కంపెనీలు: నందన్ టెక్నాలజిస్ లిమిటెడ్, యెస్ డీ వెంచర్స్ ఎస్ఏ,గ్రాండ్ బే కేనాల్ లిమిటెడ్ తదితరాలు
స్థలం: బీవీఐ


హైదరాబాద్ కు చెందిన భావనాసి జయకుమార్ ఈ కంపెనీల్లో ప్రసాద్, వోలం భాస్కర్ రావులతో కలిసి డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఇందులో నందన్ టెక్నాలజీస్ ను 2008లో స్థాపించగా, గ్రాండ్ బే కెనాల్ లిమిటెడ్ ను 2015లో స్థాపించారు. నందన్ టెక్నాలజీస్ కు అనుబంధంగా ఉన్న ఆరు కంపెనీల్లోనూ జయకుమార్ డైరెక్టర్ గా ఉన్నాడు.  

జయకుమార్ వివరణ: 'నందన్ టెక్నాలజీస్, ఎస్ డీ వెంచర్స్,గ్రాండ్ బే కెనాల తదితర విదేశీ కంపెనీలతో నాకెలాంటి సబంధం లేదు. వీటిని వోలం భాస్కర్ రావు మేనేజింగ్ డైరెక్టర్ గా నిర్వహిస్తున్నారు'

వోలం భాస్కర్ రావు
విదేశీ కంపెనీలు: నందన్ టెక్నాలజీస్, అనుబంధం సంస్థలు


నందన్ టెక్నాలజీస్, దాని అనుబంధం సంస్థలు ఆరింటికి భాస్కర్ రావు ఎండీగా కొనసాగుతున్నారు. అలాగే సికా సెక్యూరిటీస్ లిమిటెడ్ కు సహ యజమానిగా, నందన్ క్లీన్ టెక్ లిమిటెడ్ కు ప్రమోటర్ గా, 2008 ఏప్రిల్ నుంచి ఎండీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం వ్యాపారాల నుంచి రిటైరైన ఆయన ప్రస్తుతం ఎక్కువకాలం బ్రిటన్ లో గడుపుతున్నారు.

ఆయన తరఫున ఆయన కొడుకు వోలం సందీప్ వివరణ ఇస్తూ.. తన తండ్రి రిటైరైన నేపథ్యంలో ఈ కంపెనీలన్నింటినీ మోతూరి శ్రీనివాస్ ప్రసాద్ టేకోవర్ చేసుకున్నారని, విదేశాల్లో వ్యాపార ఉద్దేశంతో ఈ కంపెనీలు పెట్టినా.. ఇవి ప్రస్తుతం పనిచేయడం లేదని తెలిపారు.

ఇంకా 'పనామా పేపర్స్' మూడో జాబితాలో మోదీ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ సతీష్ మోదీ, ప్రీతం బోథ్రా, శ్వేత గుప్తా, బండారి అశోక్ రాందయాల్ చంద్ తదితర వ్యాపారవేత్తల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement