Mossack Fonseca
-
మొసాక్ ఫోన్సెకా ప్రధాన కార్యాలయంపై దాడి
పనామా పేపర్లు సృష్టించిన సంచలనంతో.. మొసాక్ ఫోన్సెకా సంస్థ ప్రధాన కార్యాలయంపై పోలీసులు దాడి చేశారు. అక్కడి నుంచే భారీ మొత్తంలో వివరాలు లీకవుతుండటంతో పోలీసులు స్పందించారు. పన్నులు ఎగ్గొట్టడానికి విదేశాల్లో ఉన్న బినామీ కంపెనీలలో పెద్దమొత్తంలో నిధులు పెట్టుబడిగా చూపించినవాళ్ల జాతకాలను 'పనామా పేపర్స్' ద్వారా బయటపెట్టి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని ఆ సంస్థ వాదిస్తోంది. తాము హ్యాకింగ్ బాధితులమని, సమాచారాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని చెబుతోంది. తమ విదేశీ ఆర్థిక పరిశ్రమ విషయంలో మరింత పారదర్శకత తెచ్చేందుకు ఇతర దేశాలతో కలిసి పనిచేస్తామని పనామా ప్రెసిడెంట్ జువాన్ కార్లోస్ వారెలా హామీ ఇచ్చారు. వ్యవస్థీకృత నేరాల విభాగం అధికారులతో కలిసి పోలీసులు ఈ దాడి చేశారు. వివిధ పత్రికలలో ప్రచురితమైన కథనాలకు సంబంధఙంచిన సమాచారం, పత్రాలను స్వాధీనం చేసుకోడానికే ఈ దాడులు చేసినట్లు అటార్నీ జనరల్ కార్యాలయం తెలిపింది. సంస్థకు చెందిన ఇతర కార్యాలయాల్లో కూడా దాడులు చేస్తామన్నారు. తాము అధికారులకు పూర్తిగా సహకరిస్తామని మొసాక్ ఫోన్సెకా సంస్థ ఒక ట్వీట్ ద్వారా తెలిపింది. విదేశాల్లో ఉన్న సెర్వర్ల ద్వారా తమ కంపెనీని ఎవరో హ్యాక్ చేశారని, దీనిపై ఇప్పటికే తాము పనామా అటార్నీ జనరల్ కార్యాలయంలో ఫిర్యాదుచేశామని మొసాక్ ఫోన్సెకా సంస్థ భాగస్వామి రామన్ ఫోన్సెకా తెలిపారు. ఈయన గతంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత అవినీతి ఆరోపణలు రావడంతో రాజీనామా చేశారు. -
మొసాక్ ఫోన్సెకా గూఢచర్యం
బెర్లిన్: మిలియన్ల కొద్దీ డాక్యుమెంట్ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనానికి సృష్టించిన పనామా పేపర్ల లీక్ వ్యవహారంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.వందమందికి పైగా సభ్యులుగా ఉన్న పరిశోధనాత్మక పాత్రికేయుల అంతర్జాతీయ కూటమి(ఐసీఐజే) పనామా కేంద్రంగా పనిచేస్తున్న పనామా పేపర్స్ మరో విషయాన్ని తేట తెల్లం చేసింది. మొసాక్ ఫోన్సికా వివిధదేశాల్లోని ప్రస్తుత, మాజీ ఉన్నత స్థాయి అధికారుల సేవలను ఏజెంట్లుగా వినియోగించుకున్నట్టు ఒక జర్మన్ వార్తాపత్రిక తెలిపింది. అనేక దేశాల గూఢచారులను మొసాకా విస్తృతంగా ఉపయోగించినట్టు మ్యూనిచ్ ఆధారిత వార్తాపత్రిక వెల్లడించింది. దాదాపు మూడు దేశాలకు చెందిన సీక్రెట్ ఏజెన్సీ అధికారులను వాడుకున్నట్టు తెలిపింది. సౌది అరేబియా, కొలంబియా, రువాండా లాంటి దేశాల అత్యున్నత అధికారులను తమ రహస్య సేవలకు వినియోగించుకున్నట్టు ఈ కథనంలో పేర్కొంది. అనేక దేశాలలో,సీఐఎ వారి మధ్యవర్తుల సహాయంతో పనిచేస్తున్నట్టు పేర్కొంది. ముఖ్యంగా 1990 లో మరణించిన సౌది ఇంటిలిజెన్స చీఫ్ షేక్ కమల్ అదాం 1970 లలో ఫోన్సెకా కు బాగా సహకరించినట్టు తెలిపింది. వివిధ సీక్రెట్ ఏజెంట్లు, వారి ఇన్ ఫార్మర్ల సేవలను సంస్థ వినియోగించుకున్నట్టు తెలిపింది. కాగా ఈ పనామా పేపర్స్ వెల్లడించిన అంశాలతో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయంగా పెను దుమారాన్ని రాజేసింది. విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్న ప్రపంచంలోనే ధనిక, శక్తివంతమైన పలు రాజకీయ నేతల జాబితాను ప్రకటించింది. దీంతో ఐస్ లాండ్ ప్రధాని రాజీనామా చేసిన సంగతి తెలిసింది. -
పనామా ప్రకంపనలు: ఆ ముగ్గురు తెలుగోళ్లు!
పన్ను స్వర్గధామలైన విదేశాల్లో బోగస్ కంపెనీలు పెట్టి.. నల్లడబ్బు దాచుకున్న కుబేరుల బాగోతం ప్రపంచాన్ని కుదిపేస్తూనే ఉంది. 'పనామా పత్రాల' లీకైన వ్యవహారానికి సంబంధించి తాజాగా మూడో జాబితా విడుదలైంది. ఈ మూడో జాబితాలో ముగ్గురు తెలుగువాళ్లతోపాటు పలువురు భారతీయ పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. తెలుగువాళ్లు ఎవరంటే..? మోతూరి శ్రీనివాస్ ప్రసాద్ విదేశీ కంపెనీలు: నాలుగు స్థలం: బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ) హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్ ప్రసాద్ కనీసం నాలుగు విదేశీ కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్నట్టు ఫొన్సెకా పత్రాల ద్వారా వెల్లడైంది. 2011లో బీవీఐలో ఈ కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. ప్రసాద్ నందన్ క్లీన్ టెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండటంతోపాటు సికా సెక్యూరిటీస్ లిమిటెడ్ కు కో ఓనర్ గా కొనసాగుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద బయోచమురు ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పినట్టు ఘనత తెచ్చుకున్న ప్రసాద్ పేరిట మరో 12 కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే, బయోడీజిల్ ఎగుమతుల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై 2012 ఏప్రిల్ 2న ఆయన అరెస్టయి.. ప్రస్తుతం బెయిల్ పై విడుదలయ్యారు. ప్రసాద్ వివరణ: కేవలం ఒక డాలర్ తో ఈ కంపెనీలు స్థాపించాం, విదేశాల్లో వ్యాపారం చేద్దామనే ఆశతో వీటిని పెట్టినప్పటికీ అది కుదరకపోవడంతో ప్రస్తుతం ఆ కంపెనీలన్నీ పనిచేయడం లేదు. వీటిని ప్రస్తుతం మేం నడుపడం లేదు. భావనాసి జయకుమార్ విదేశీ కంపెనీలు: నందన్ టెక్నాలజిస్ లిమిటెడ్, యెస్ డీ వెంచర్స్ ఎస్ఏ,గ్రాండ్ బే కేనాల్ లిమిటెడ్ తదితరాలు స్థలం: బీవీఐ హైదరాబాద్ కు చెందిన భావనాసి జయకుమార్ ఈ కంపెనీల్లో ప్రసాద్, వోలం భాస్కర్ రావులతో కలిసి డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఇందులో నందన్ టెక్నాలజీస్ ను 2008లో స్థాపించగా, గ్రాండ్ బే కెనాల్ లిమిటెడ్ ను 2015లో స్థాపించారు. నందన్ టెక్నాలజీస్ కు అనుబంధంగా ఉన్న ఆరు కంపెనీల్లోనూ జయకుమార్ డైరెక్టర్ గా ఉన్నాడు. జయకుమార్ వివరణ: 'నందన్ టెక్నాలజీస్, ఎస్ డీ వెంచర్స్,గ్రాండ్ బే కెనాల తదితర విదేశీ కంపెనీలతో నాకెలాంటి సబంధం లేదు. వీటిని వోలం భాస్కర్ రావు మేనేజింగ్ డైరెక్టర్ గా నిర్వహిస్తున్నారు' వోలం భాస్కర్ రావు విదేశీ కంపెనీలు: నందన్ టెక్నాలజీస్, అనుబంధం సంస్థలు నందన్ టెక్నాలజీస్, దాని అనుబంధం సంస్థలు ఆరింటికి భాస్కర్ రావు ఎండీగా కొనసాగుతున్నారు. అలాగే సికా సెక్యూరిటీస్ లిమిటెడ్ కు సహ యజమానిగా, నందన్ క్లీన్ టెక్ లిమిటెడ్ కు ప్రమోటర్ గా, 2008 ఏప్రిల్ నుంచి ఎండీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం వ్యాపారాల నుంచి రిటైరైన ఆయన ప్రస్తుతం ఎక్కువకాలం బ్రిటన్ లో గడుపుతున్నారు. ఆయన తరఫున ఆయన కొడుకు వోలం సందీప్ వివరణ ఇస్తూ.. తన తండ్రి రిటైరైన నేపథ్యంలో ఈ కంపెనీలన్నింటినీ మోతూరి శ్రీనివాస్ ప్రసాద్ టేకోవర్ చేసుకున్నారని, విదేశాల్లో వ్యాపార ఉద్దేశంతో ఈ కంపెనీలు పెట్టినా.. ఇవి ప్రస్తుతం పనిచేయడం లేదని తెలిపారు. ఇంకా 'పనామా పేపర్స్' మూడో జాబితాలో మోదీ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ సతీష్ మోదీ, ప్రీతం బోథ్రా, శ్వేత గుప్తా, బండారి అశోక్ రాందయాల్ చంద్ తదితర వ్యాపారవేత్తల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. -
బద్దలైన నీరా రాడియా బండారం !
నీరా రాడియా.. 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో దేశాన్ని కుదిపేసిన పేరు ఇది. కార్పొరేట్ లాబీయిస్ట్ అయిన ఆమె రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, లాబీయిస్టులతో జరిపిన టెలిఫోన్ సంభాషణలు లీకవ్వడం దుమారం రేపింది. తన క్లయింట్లయిన కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకు ఆమె యూపీఏ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులతో లాబీ నడిపింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, రతన్ టాటాకు చెందిన టాటా టెలిసర్వీసెస్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఆమె క్లయింట్లుగా ఉన్నాయి. తమకు అనుకూలురైన వ్యక్తులను కేంద్ర కేబినెట్ లో నియమించేందుకు ఆమె నడిపిన లాబీ వ్యవహారం 'రాడియాగేట్'గా ప్రసిద్ధికి ఎక్కింది. 2జీ స్పెక్ట్రం కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరుపుతుండటంతో ఆమె పేరు ఇటీవల అంతగా వినిపించడం లేదు. కానీ, తాజాగా 'పనామా పేపర్స్' లీక్ తో బద్దలవుతున్న కుబేరుల బండారంలో నీరా రాడియా పేరు కూడా చేరింది. పనామాకు చెందిన మొస్సాక్ ఫొన్సెకా కంపెనీ పత్రాల్లో ఆమె పేరు కూడా ఉందని తాజాగా ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక వెల్లడించింది. దాదాపు పది దేశాల్లో నీరా రాడియాకు అక్రమ ఆస్తులు ఉన్నట్టు ఐటీ దర్యాప్తు సంస్థలు భావిస్తుండగా.. తాజాగా ఆమెకు విదేశాల్లో ఓ కంపెనీ ఉన్నట్టు 'పనామా పత్రాల' ద్వారా వెల్లడైంది. క్రోన్ మార్ట్ ఇంటర్నేషనల్ గ్రూప్ లిమిటెడ్ పేరిట 1994లో ఓ అంతర్జాతీయ వ్యాపార కంపెనీని రాడియా పేరిట బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ)లో ఫొన్సెకా ఏర్పాటుచేసింది. 2004 జూన్ వరకు ఈ కంపెనీ పత్రాల్లో నీరా రాడియా సంతకాలు చేసినట్టు పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఫొన్సెకా రిజిస్టర్ లో ఈ కంపెనీకి సంబంధించిన రికార్డులు 2009, మార్చ్ 2012నాటివి ఉన్నాయి. ఈ కంపెనీకి సంబంధించిన మొత్తం 232 పత్రాలు లీకయ్యాయి. ఇందులో ఇన్ కార్పొరేషన్ డాక్యుమెంట్స్, రాడియా సహా డైరెక్టర్ల పేరిట ఉన్న షేర్ సర్టిఫికెట్లు సైతం ఉన్నాయి. ఈ పత్రాల్లో రాడియాను బ్రిటిష్ పౌరురాలిగా పేర్కొన్నారు. ఇంకా ఆశ్ఛర్యకరమైన విషయమేమిటంటే క్రౌన్ మార్ట్ ఇంటర్నేషనల్ (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ పేరిట ఆమె లండన్ లో కూడా ఓ వ్యాపార సంస్థను ఏర్పాటుచేసింది. 'జనరల్ బిజినెస్' కోసం అంటూ ఏర్పాటుచేసిన ఈ రెండు కంపెనీల్లో ప్రస్తుతం రాడియా కుటుంబసభ్యులు యజమానులుగా ఉండగా, ఆమె ప్రధాన షేర్ హోల్డర్ గా కొనసాగుతున్నారు. 1992లో ఏర్పాటుచేసిన క్రౌన్ మార్ట్ ఇండియా కంపెనీలో రాడియా తండ్రి ఇక్బాల్ నరైన్ మీనన్ కు ఒక శాతం వాటా ఉండగా, 1995లో లక్ష పౌండ్ల అప్పు కారణంగా ఈ కంపెనీ దివాళా తీసినట్టు ప్రకటించారు. ఈ కంపెనీలో రాడియా కొడుకులు అక్షయ్, ఆకాశ్, కరణ్ లు కూడా వాటాదారులుగా ఉన్నారు. కాగా, నీరా రాడియా బ్రిటిష్ పౌరురాలు అన్న విషయం వాస్తవమేనని, ఆమెకు ప్రస్తుతం యూకే పాస్ పోర్టు కూడా ఉందని ఆమె కార్యాలయం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. కొసమెరుపు! జ్యోతిష్యుల సలహా ప్రకారం నీరా రాడియా తన పేరులో ఆంగ్ల అక్షరం 'ఐ'ని అదనంగా ఇటీవల చేర్చుకున్నారు. కానీ ఫొన్సెకా పత్రాల్లో మాత్రం ఆమె పేరు గతంలో ఉన్న మాదిరిగానే నమోదైంది. గతంలో ఉన్నట్టు (Nira Radia)గానే ఆమె పేరు ఈ పత్రాల్లో కనిపిస్తోంది.