
పన్నీర్ రాజీనామా ఉపసంహరణకు వీలుకాదు
ముఖ్యమంత్రి పదవికి పన్నీర్‌సెల్వం ఇచ్చిన రాజీనామాను ఉపసంహరిం చుకోవడం సాధ్యపడదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి పదవికి పన్నీర్‌సెల్వం ఇచ్చిన రాజీనామాను ఉపసంహరిం చుకోవడం సాధ్యపడదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. శశికళ తన చేత బలవంతంగా రాజీనామా చేయించారని, ప్రజలు, పార్టీ కార్యకర్తలు కోరితే రాజీనామా ఉపసంహ రణకు తాను సిద్ధమని పన్నీర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పన్నీర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించిన పరిస్థితిలో ఉపసంహరణ సాధ్యమా అనే సందేహం తలెత్తింది.
ఈ అంశంపై మద్రాసు హైకోర్టు ప్రముఖ న్యాయవాది ఆర్ బాలకనకరాజ్ మాట్లాడుతూ... పన్నీర్‌సెల్వం రాజీనామాను గవర్నర్ ఆమోదించడంతోపాటు కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కూడా ఆదేశాలు జారీచేయడం వల్ల ఉపసంహరణ సాధ్యం కాదని తెలిపారు. రాజీనామా ఉపసంహరణ కంటే తనకు మద్దతుగానిలిచిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరవచ్చని చెప్పారు. శశికళ ప్రభుత్వ ఏర్పాటుకు విజ్ఞప్తి చేస్తున్నందున ఎవరికి తొలిసారి అవకాశం ఇవ్వాలో గవర్నర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు.