ముఖ్యమంత్రిగా పన్నీర్.. అర్ధరాత్రి ప్రమాణం
ముఖ్యమంత్రిగా పన్నీర్.. అర్ధరాత్రి ప్రమాణం
Published Tue, Dec 6 2016 8:52 AM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
శశికళకు పార్టీ నాయకత్వ బాధ్యతలు
తమిళనాడు 19వ ముఖ్యమంత్రి గా పన్నీర్‌సెల్వం నియమితులయ్యారు. తన జేబులో అమ్మ జయలలిత ఫొటో పెట్టుకుని మరీ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇక పార్టీ నాయకత్వ బాధ్యతలను జయలలిత నెచ్చెలి శశికళకు అప్పగించాలని పార్టీ ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించింది. దీనిపై కొంత అసంతృప్తి వ్యక్తమైనా, చివరకు పార్టీ పగ్గాలను ఆమెకే అప్పగించారు. ఓ పన్నీర్ సెల్వం (65) జయలలితకు అత్యంత విధేయుడు. గతంలో ఆమె జైలుకు వెళ్లినప్పుడు కూడా ఆయననే ముఖ్యమంత్రిగా నియమించినా, అప్పట్లో అమ్మ ఫొటోను మాత్రమే కుర్చీలో ఉంచి తాను విడిగా కూర్చుని కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఆయనకు మించిన విశ్వసనీయులు ఎవరూ ఉండరన్న ఉద్దేశంతో పన్నీరుకే ముఖ్యమంత్రి పదవి అప్పగించారు. దాంతో ఆయన మూడోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినట్లయింది. జయలలిత ఇన్నాళ్లూ వ్యక్తిగతంగా చూసిన 8 మంత్రిత్వ శాఖలను కూడా పన్నీర్ సెల్వంకే ఇచ్చారు. అర్ధరాత్రి 1.15 గంటల సమయంలో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆయనతో రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతో పాటు జయలలిత కేబినెట్‌లో ఉన్న మొత్తం 31 మంది మంత్రులు కూడా మళ్లీ ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు పన్నీర్ సెల్వాన్ని తమ నాయకుడిగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా కలిసి ఎన్నుకున్నారు.
జయలలిత తర్వాత ప్రభుత్వ, పార్టీ రథసారధులను ఎంపిక చేసుకోవడానికి అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు సోమవారం ఉదయం 11 గంటలకు అపోలో ఆసుపత్రిలో సమావేశమయ్యారు. దీనికి ముందు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు విడిగా శశికళను కలిశారు. ఆ తర్వాత పన్నీర్ సెల్వంతో పాటు మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు శశికళను కలసి భవిష్యత్ ఏర్పాట్ల గురించి చర్చించారు. పన్నీర్‌ను సీఎం చేయడానికి అనుకూలంగా మెజారిటీ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన విషయం చర్చకు వచ్చింది. శశికళ కూడా పన్నీర్ వైపే ఉన్నారని ఆమె మద్దతుదారులైన ఎమ్మెల్యేలు వెల్లడించారు. పన్నీర్‌ను సీఎం చేసి శశికళకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చే విషయమై చర్చ జరిగింది. ప్రతిసారి పన్నీర్‌కే అవకాశం ఎందుకు ఇవ్వాలని మంత్రి ఎడపాడి పళనిస్వామి, ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీతో పాటు మరికొందరు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారని తెలిసింది.
శశికళకు పార్టీ పగ్గాలు అప్పగించే ప్రతిపాదనను సైతం సుమారు 45 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని, పార్టీని బతికించుకోవాలంటే ఇంతకుమించి మార్గం లేదని మరికొందరు తమ అభిప్రాయం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఇవ్వరాదనే అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. పన్నీర్ సెల్వం 2001లో ఆపద్ధర్మ సీఎంగా, 2015లో జయలలిత జైలుకు వెళ్లినప్పుడు, 2016 సెప్టెంబర్ 22 నుంచి ఆపద్ధర్మ సీఎంగా పని చేశారు.
Advertisement