ముంబై : 26 / 11 దాడులు జరిగిన తర్వాత ఆర్మీ సర్జికల్ దాడులు చేయాలని భావించింది. కానీ కాంగ్రెస్ పార్టీ అందుకు ఒప్పుకోలేదన్నారు నటుడు పరేష్ రావల్. ప్రస్తుతం ఆయన ‘యురి : ద సర్జికల్ స్ట్రైక్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘26 / 11 దాడుల అనంతరం ఆర్మీ సర్జికల్ దాడులు చేయాలని భావించింది. కానీ అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అందుకు ఒప్పుకోలేదు. మన ఆర్మీకి మద్దతు తెలపడానికి బదులు కాంగ్రెస్ తన ఓటు బ్యాంక్ గురించి ఆలోచించింది. ఆ సమయంలో మన సైనిక శక్తి గురించి జనాల్లో సందేహాలు తలెత్తాయి’ అన్నారు.
అయితే ఆ సందేహాలకు మోదీ సమాధానాలు చెప్పారన్నారు పరేష్. ‘మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సర్జికల్ దాడులకు ఆమోదం తెలిపారు. మనకు చాలా బలమైన సైనిక వ్యవస్థ ఉంది. కానీ మన దేశంలోని రాజకీయ వ్యవస్థ వల్ల అప్పుడప్పుడు ఇలాంటి ప్రతికూల పరిస్థితులు తలెత్తుతుంటాయి. కానీ మన సైనిక శక్తి సామర్థ్యాల గురించి తెలియజేయడమే కాక, పాక్ చేసే వక్ర పనులకు సరైన సమాధానం చెప్పడం చాలా అవసరం’ అన్నారు.
అంతేకాక యురి సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఇదొక పొలిటికల్ థ్రిల్లర్‌గా ఉండబోతుంది. సైన్యం సర్జికల్ దాడులకు ఎలా సన్నద్దమయ్యిందనే అంశాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నాం’ అన్నారు. సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య దార్ యురి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రొన్ని స్క్రూవాలా బేనర్‌పై ఆర్ఎస్‌వీపీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్కీ కౌశల్, యామీ గౌతమ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment