పార్కింగ్ స్థలాలుగా బస్ డిపోలు..! | Parking spaces as the Bus Depot | Sakshi
Sakshi News home page

పార్కింగ్ స్థలాలుగా బస్ డిపోలు..!

Published Mon, Jun 16 2014 10:12 PM | Last Updated on Sat, Sep 2 2017 8:54 AM

పార్కింగ్ స్థలాలుగా బస్ డిపోలు..!

పార్కింగ్ స్థలాలుగా బస్ డిపోలు..!

 సాక్షి, ముంబై: నష్టాల్లో కూరుకుపోయిన బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ అదనపు ఆదాయం వేటలో పడింది. అందుకు బస్ డిపోల స్థలాలను వాహనాల పార్కింగ్‌కు ఇవ్వాలని బెస్ట్ పరిపాలన విభాగం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. నగరం, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో మొత్తం 26 బెస్ట్ బస్ డిపోలున్నాయి. ఇందులో పార్కింగ్ చేసే బస్సులన్నీ ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్లపై తిరుగుతుంటాయి. రాత్రి ఆలస్యంగా డిపోలకు చేరుకుంటాయి. దీంతో రోజంతా ఖాళీగా ఉన్న డిపోల్లోని స్థలాలను వాహనాల పార్కింగ్‌కు కేటాయిస్తే అదనపు ఆదాయం వస్తుందని పరిపాలని విభాగం భావించింది.
 
 అందుకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించి మంజూరు కోసం బెస్ట్ సమితికి పంపించింది. ఇక్కడ మంజూరు లభించగానే త్వరలో వాహనాల పార్కింగ్‌కు స్థలం అందుబాటులోకి రానుంది. ఈ స్థలాలను ప్రైవేటు వాహనాల పార్కింగ్ కోసం వాడేందుకు కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించనుంది. ఆ ప్రకారం ప్రతి డిపోలో 20 ద్విచక్ర వాహనాలు, 10 కార్లు, ఐదు భారీ వాహనాలు ఇలా పార్కింగ్ చేసేందుకు అనుమతి ఇవ్వనుంది. స్థాయీ సమితిలో ఈ ప్రతిపాదనకు మంజూరు లభించగానే పార్కింగ్ చార్జీలను నిర్ణయిస్తామని బెస్ట్ యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే ఈ బస్ డిపో స్థలాలను కేవలం ఉదయం నుంచి రాత్రి వరకు 12 గంటలు మాత్రమే వాడుకునేందుకు అనుమతినివ్వనున్నారు.
 
కాంట్రాక్టర్లకు కూడా ఈ షరతులపైనే బాధ్యతలు అప్పగిస్తారు. కాగా భద్రతాపరమైన ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తామే తీసుకుంటామని బెస్ట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. అదేవిధంగా వాహనదారుల నుంచి అడ్డగోలుగా చార్జీలు వసూలు చేయడాన్ని నిరోధించేందుకు బెస్ట్ స్వయంగా పార్కింగ్ చార్జీలను కేటాయించనుందని తెలిపారు. ఇదిలా ఉండగా, వృథాగా ఉన్న కొన్ని బెస్ట్ బస్ స్థలాలను 30 ఏళ్ల వరకు లీజుకు ఇవ్వాలని ఇదివరకే బెస్ట్ సంస్థ నిర్ణయం తీసుకుంది. కాని వ్యతిరేకత రావడంతో ఈ ప్రతిపాదనను విరమించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement