ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు
Published Wed, Nov 16 2016 11:02 AM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ప్రారంభం అయ్యాయి. లోక్ సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ...ఇటీవల మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపారు. నెలరోజుల పాటు జరిగే పార్లమెంటు సమావేశాల్లో నోట్ల రద్దుతో పాటు సర్జికల్ దాడులు, జమ్మూకశ్మీర్, ఓఆర్‌ఓపీ, రైతుల సమస్యలు వంటి అంశాలతో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి.
ప్రజల కష్టాలను అర్థం చేసుకోవడంలో ప్రధాని విఫలమయ్యారని ఆరోపిస్తూ, పార్లమెంట్ సమావేశాలలో తొలుత పెద్ద నోట్ల రద్దు, తదనంతరం ప్రజల అవస్థలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. నోట్ల రద్దుపై సంయుక్త పార్లమెంటు కమిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో పార్లమెంటును స్తంభింపజేయనున్నాయి.
అంతకు ముందు... ప్రధానమంత్రి పార్లమెంట్ మీడియా హౌస్ వద్ద మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్ష పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్లో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఏ అంశంపైన అయినా చర్చించేందుకు సిద్ధమని తెలిపారు.
Advertisement