విజయ్ మాల్యాపై బహిష్కరణ వేటు!
న్యూఢిల్లీ : విజయ్ మాల్యాపై మరో ఎదురు దెబ్బ తగిలింది. రాజ్యసభ సభ్యుడుగా ఉన్న ఆయనను బహిష్కరించాలని పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ సోమవారం నిర్ణయించింది. ఇవాళ సాయంత్రం సమావేశమైన ఈ కమిటీ మాల్యా అంశంపై చర్చించి ,ఆయన రాజ్యసభ సభ్యత్వం రద్దు చేయాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు ఎథిక్స్ కమిటీ విజయ్ మాల్యాకు నోటీసు జారీ చేసింది. మే 3వ తేదీలోగా ఎథిక్స్ కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది.
కమిటీ జారీ చేసిన నోటీసుపై మాల్యా వారంలోగా సమాధానం ఇవ్వాల్సి ఉంది. కాగా మాల్యా కర్ణాటక నుంచి 2002లో కాంగ్రెస్-జనతాదళ్ మద్దతుతో రాజ్యసభకు ఎన్నిక అయిన విషయం తెలిసిందే. 2010లో ఆయన మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం ఈ ఏడాది జూలైతో ముగియనుంది. కాగా మాల్యాకు తొమ్మిదివేల కోట్ల బ్యాంకు రుణ కుంభకోణం కేసు ఓ వైపు, మరోవైపు ఆయన పాస్పోర్ట్ కూడా రద్దు అయిన విషయం తెలిసిందే. తాజాగా రాజ్యసభ సభ్యత్వం రద్దుకు ఎథిక్స్ కమిటీ సిఫార్సుతో ఆయనకు మరో ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు.