విజయ్ మాల్యా రాజీనామా తిరస్కరణ
న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్, ఎంపీ విజయ్ మాల్యా రాజీనామాను రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ తిరస్కరించారు. రాజీనామా పత్రంలో మాల్యా సంతకం.. అసలు సంతకంతో సరిపోలటం లేదన్న కారణంతోనే దీన్ని తిరస్కరించినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ మాల్యాకు ఉత్తరం రాశారు.
నిబంధనల ప్రకారం సభ్యుడి రాజీనామా స్వచ్ఛందంగా జరగాలని, వాస్తవికంగా ఉండాలన్న విషయాన్ని.. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఓఎస్డీ గురుదీప్ సింగ్ సప్పల్ ట్వీటర్‌లో పేర్కొన్నారు. మాల్యా సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఎథిక్స్ కమిటీ రేపు రాజ్యసభకు సూచించనుంది. వెంటనే రాజ్యసభలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టి మాల్యా సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. కాగా మాల్యా రాజీనామా చేసినప్పటికీ రాజ్యసభ మాత్రం ఆయనను బహిష్కరించడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.