మాల్యా తాజా రాజీనామా ఆమోదం
న్యూఢిల్లీ: మద్యం వ్యాపారి, ఎంపీ విజయ్ మాల్యా రాజ్యసభ సభ్యత్వం ముగిసింది. ఆయన తాజాగా పంపిన మరో రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఆమోదించారు. డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఈమేరకు బుధవారం రాజ్యసభలో ప్రకటించారు. తక్షణమే ఇది అమల్లోకి వచ్చిందని చెప్పారు. నిబంధనల ప్రకారం లేదంటూ మాల్యా తొలుత పంపిన రాజీనామా లేఖను అన్సారీ మంగళవారం తిరస్కరించడం తెలిసిందే. దీంతో మాల్యా తాను సంతకం చేసిన రాజీనామాను మరోసారి పంపారు.
ఎగువ సభలో స్వతంత్ర సభ్యుడిగా ఉన్న మాల్యా.. బ్యాంకులకు రూ.9,400 కోట్లు ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా, మాల్యా సభ్యత్వాన్ని తక్షణమే బహిష్కరించాలంటూ రాజ్యసభ నైతిక విలువల కమిటీ కూడా తన సిఫార్సును బుధవారమే నివేదించింది. మాల్యా తొలుత పంపిన లేఖతోసహా మొత్తం వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకొని కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది.