సభా సమయం తగ్గిపోతోంది: హమీద్ అన్సారీ
న్యూఢిల్లీ : భావోద్వేగాల నియంత్రణ, సభను సజావుగా జరిపించడం రాజ్యసభ సభ్యులకు అత్యవసరమని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ అన్నారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల సమయం తగ్గిపోతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన వారికి శనివారం ఏర్పాటు చేసిన ఓరియెంటేషన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కొన్ని గ్రూపుల, కొందరు వ్యక్తుల ప్రయోజనాలకోసం ఎంపీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ విలువైన సభాసమయాన్ని పాడుచేస్తున్నారని, దీన్ని నివారించేందుకు సభ్యులు సభా మర్యాదలు పాటించాలని సూచించారు.
గతంలో 100 నుంచి 110 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలుండేవని, ప్రజా సమస్యలపై చర్చించేందుకు తగినంత సమయం ఉండేదని ఇప్పుడది 70 రోజులకు పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి సభకు అంతరాయం కలిగిస్తూ..విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని ఇలా ప్రవర్తించడం ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు.