వేటు తప్పదనే విజయ్ మాల్యా రాజీనామా!
లండన్: బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి లండన్లో తలదాచుకుంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాజాగా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్కు రాజీనామా లేఖను పంపినట్లు మాల్యా సోమవారం ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. బ్యాంకులకు రూ. 9000 కోట్ల ఎగవేతకు పాల్పడిన మాల్యాపై చర్య తీసుకోవాలని రాజ్యసభ నైతిక విలువల కమిటీ భావిస్తున్న నేపథ్యంలో మాల్యానే రాజీనామా సమర్పించడం గమనార్హం.
మాల్యా వ్యవహారంపై కాంగ్రెస్ నేత కరణ్ సింగ్ నేతృత్వంలో నైతిక విలువల కమిటీ గతవారం సమావేశమై.. ఆయన నుంచి వివరణ కోరిన సంగతి తెలిసిందే. ఇందుకు మాల్యాకు వారం రోజులు గడువు ఇచ్చింది. మంగళవారం కమిటీ మరోసారి సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో వేటు తప్పదని భావించిన మాల్యా తనకు తానుగా రాజీనామా సమర్పించినట్లు తెలుస్తోంది.
మనీ లాండరింగ్ వ్యవహారంలో నాన్ బెయిలబుల్ వారెంట్ ఎదుర్కొంటున్న మాల్యాను వెనక్కి పంపాలని కోరుతూ గతవారం భారత ప్రభుత్వం బ్రిటన్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై మాల్యా మాట్లాడుతూ ఇప్పట్లో తనకు భారత్కు వచ్చే ఉద్దేశం లేదని వెల్లడించారు.