‘కాశ్మీర్ కిరీటం’పై పార్టీల గురి
జోరందుకున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం
తొలి దశ ఎన్నికల్లో 15 సీట్లకు 25న పోలింగ్
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఈ నెల 25న జరగనున్న తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీల ప్రచార పర్వం జోరందుకుంది. తొలి దశ ఎన్నికల్లో ఏడు జిల్లాల్లోని 15 నియోజకవర్గాల్లో (కాశ్మీర్ డివిజన్‌లో 5, లడఖ్ డివిజన్‌లో 4, జమ్మూ డివిజన్‌లో 6) పోలింగ్ జరగనుండటంతో వివిధ పార్టీల నేతలు ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), ప్రతిపక్ష పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)తోపాటు కాంగ్రెస్, బీజేపీకి చెందిన నేతలు హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నారు.
అధికారాన్ని నిలబెట్టుకునేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ తాపత్రయపడుతుండగా ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకొని గద్దెనెక్కాలని పీడీపీ చూస్తోంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని ఆరు ఎంపీ సీట్లకుగానూ 3 చోట్ల గెలిచి ఊపుమీద ఉన్న బీజేపీ సుపరిపాలన, అభివృద్ధి నినాదాలతో ప్రజల్లోకి వెళ్లి తొలిసారి అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ గత యూపీఏ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధిని చూపుతూ ప్రజల విశ్వాసం పొందాలని చూస్తోంది.మొత్తం 87 అసెంబ్లీ స్థానాలకు ఐదు దశల్లో ఎన్నికలు జరగనుండగా తొలి దశలో 123 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
సీఎం ఒమర్‌కు కఠిన పరీక్ష.. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేషనల్ కాన్ఫరెన్స్‌కు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు కఠిన పరీక్షగా మారనున్నాయి. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రం కావడం, అమాయక పౌరులపై భద్రతా దళాల దాడుల ఆరోపణలు, రాష్ట్రాన్ని కనీవినీ ఎరుగని స్థాయిలో ఇటీవల వరదలు ముంచెత్తినప్పుడు బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం తదితర కారణాలు అధికార నేషనల్ కాన్ఫరెన్స్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. ఈ నేపథ్యంలో సీఎం, పార్టీ స్టార్ క్యాంపెయినర్ అయిన ఒమర్ అబ్దుల్లా ప్రచార భారాన్ని తలకెత్తుకున్నారు. తన తండ్రి, పార్టీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా అనారోగ్యం కారణంగా లండన్‌లో చికిత్స పొందుతుండటంతో ఆయన ఒంటరిగానే ప్రచారం చేపడుతున్నారు.
‘మిషన్ 44’ వ్యూహంతో బీజేపీ...
రాష్ర్టంలో తొలిసారి అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఇందుకోసం ‘మిషన్ 44’ వ్యూహంతో ఎన్నికల బరిలోకి దిగింది. మొత్తం 87 సీట్లులో 44 సీట్లకుపైగా గెలుచుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జమ్మూ, లడఖ్‌లలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతోపాటు ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే కాశ్మీర్ లోయలో ఇప్పటివరకూ ఒక్క సీటు కూడా గెలవలేదన్న విమర్శను చెరిపేసి గౌరవప్రదమైన సీట్లు గెలుచుకోవాలని చూస్తోంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో జమ్మూ డివిజన్‌లోని 37 అసెంబ్లీ సీట్ల పరిధిలో 24 చోట్ల పార్టీ ఆధిక్యం కనబరచడం బీజేపీ నేతలకు మరింత బలాన్నిస్తోంది. కాశ్మీర్ లోయలో గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు కాషాయ పార్టీ ఆర్‌ఎస్‌ఎస్ సాయంతో వ్యూహ రచన చేస్తోంది. ముస్లిం యువతను బీజేపీవైపు తిప్పుకునేందుకు ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ ముస్లిం రాష్ట్రీయ మంచ్ రంగంలోకి దిగింది.
గెలుపుపై పీడీపీ ధీమా... ఇక ప్రతిపక్ష పీడీపీ పాట్రన్ ముఫ్తీ మొహమ్మద్ సయీద్, ఆయన కుమార్తె, పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ సైతం విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. తమను గెలిపిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని బహిరంగ సభల్లో హామీలు ఇస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ ఎన్నికల వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు పలువురు పీడీపీ నేతలు ‘ముస్లిం సీఎం’ ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. రాష్ర్టంలో సుమారు 70 శాతం ముస్లింలే ఉన్నందువల్ల సీఎంగా ముస్లిం నాయకుడే ఉండాలంటూ పీడీపీ ఎమ్మెల్యే పీర్జాదా మన్సూర్ సహా మరికొందరు వాదిస్తున్నారు.