పఠాన్కోట్ ఉగ్రదాడిపై ఎవరేమన్నారంటే..
న్యూఢిల్లీ: పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఉగ్రవాదదాడిని కేంద్ర ప్రభుత్వం, విపక్షాలు ముక్తకంఠంతో ఖండించాయి. దాయాది పాకిస్తాన్ కూడా ఈ దాడులను ఖండించింది. ఉగ్రవాద చర్యలను నిర్మూలించడంలో భారత్తో కలసి పాక్ చేస్తుందని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయం పేర్కొంది. ఈ దాడి నేపథ్యంలో భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రత సలహాదారుతో అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ దాడిపై ఎవరేమన్నారంటే..
పాకిస్తాన్తో మనం శాంతిని కోరుకుంటున్నా, పాక్ నుంచి ఆరంభించే దాడులకు దీటుగా సమాధానమిస్తాం. మన భద్రత దళాలు గర్వకారణం. రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి
పఠాన్కోట్ ఉగ్రవాదదాడిని తీవ్రంగా ఖండించాలి. ఈ దాడిలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన సైనికులకు సెల్యూట్. అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి
ఉగ్రవాద చర్యల నిర్మూలనకు పంజాబ్ పోలీసుల సహకారంతో కేంద్ర భద్రత బలగాలు పనిచేస్తున్నాయి. కిరెన్ రిజ్జూ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి
ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. రాహుల్ గాంధీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు
ప్రస్తుతం విదేశాంగ విధానాన్ని ప్రశ్నించడం సరికాదు. ఉగ్రవాదులతో పోరాటంలో మన సైనికులకు అండగా నిలవాలి. లాలూ ప్రసాద్, ఆర్జేడీ చీఫ్
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమైన వారం తర్వాత ఈ దాడి జరగడం అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తాం. అహ్మద్ పటేల్, కాంగ్రెస్
కశ్మీర్ తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులు పంజాబ్ను లక్ష్యంగా చేసుకోవడం దేశానికి ముప్పు- సంజయ్ రౌత్, శివసేన