ఇది మనుషులు చేసే పనేనా?
రాంచి: పేదోడికి వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆస్పత్రులు వసతులు లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరత, బాధ్యతారాహిత్యం కారణంగా సర్కారు దవఖానాలు గరీబోళ్లకు సరైన వైద్యం అందించడంలో విఫలమవుతున్నాయి. గవర్నమెంట్ ఆస్పత్రుల్లో ఘోరాలను కళ్లకుకట్టే ఘటన జార్ఖండ్ రాజధాని రాంచిలో చోటు చేసుకుంది.
రాష్ట్రంలోని అతిపెద్ద సర్కారు ఆస్పత్రి రాంచి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్స్ సైన్సెస్(రిమ్స్)లో ఓ రోగికి నేలపై అన్నం వడ్డించిన వైనం మానవతావాదులను కలచివేసింది. దిగ్భ్రాంతి కలిగించే ఈ ఉదంతంకు సంబంధించిన ఫొటోను ‘దైనిక్ భాస్కర్’ పత్రిక ప్రచురించింది. చేతికి కట్టుతో ఉన్న పాల్మతి దేవి అనే మహిళారోగికి బుధవారం నేలపై వడ్డించిన భోజనం తింటున్నట్టు ఈ ఫోటోలో ఉంది. ప్లేట్లు లేవన్న సాకుతో ఆమెకు ఆస్పత్రి వార్డు బోయ్స్ నేలపైనే అన్నం, పప్పు, కూరలు వడ్డించారు.
ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్న పాల్మతి దేవి దగ్గర పళ్లెం లేకపోవడంతో ప్లేట్ ఇవ్వమని ఆమె అడగ్గా సిబ్బంది దురుసుగా సమాధానం ఇచ్చారు. ప్లేట్లు లేవని నేలపైనే ఆమెకు భోజనం వడ్డించి అమానవీయంగా ప్రవర్తించారు. మీడియా ద్వారా ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రూ. 300 కోట్ల వార్షిక బడ్జెట్ కలిగిన ఆస్పత్రిలో రోగులు భోజనం తినడానికి ప్లేట్లు లేకపోవడం శోచనీయమని ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. రోగుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.