
40 శాతం వరకూ జీఎస్‌టీ పన్ను!
శ్లాబుల్లో ప్రస్తుతం మార్పులు లేవు ∙అధికారుల వెల్లడి
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) రేటును బిల్లులో ఉన్న 14 శాతం నుంచి 20 శాతానికి పెంచాలని జీఎస్‌టీ కౌన్సిల్ ప్రతిపాదించిన నేపథ్యంలో పన్ను అత్యధికంగా 40 శాతం వరకూ ఉండవచ్చని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు. వచ్చే వారం ప్రారంభమయ్యే రెండో దఫా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జీఎస్‌టీ బిల్లు చర్చకు వచ్చినపుడు పన్ను రేటు ‘14 శాతానికి మించకూడదు’ అనే నిబంధన స్థానంలో ‘20 శాతానికి మించకూడదు’ అనే నిబంధన చేర్చనున్నారు.
ఈ మార్పు ప్రభావం 4 శ్లాబ్‌ల విధానంపై ఉండదని, అయితే భవిష్యత్‌లో పన్ను పెంపుదలకు ఇబ్బందిలేకుండా ఉండటానికే కొత్త నిబంధన అని అధికారులు పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. భవిష్యత్‌లో పన్ను పెంచాల్సి వస్తే పార్లమెంట్ అనుమతి తీసుకోనక్కర్లేకుండానే.. కొత్త నిబంధన వల్ల జీఎస్‌టీ కౌన్సిల్ పెంచవచ్చని చెప్పారు. దీంతో కేంద్ర, రాష్ట్ర జీఎస్‌టీలు అత్యధికంగా 20 శాతం చొప్పున ఉండనున్నాయి కాబట్టి పన్ను అత్యధికంగా 40 వరకూ ఉండే అవకాశం ఉంటుందని వారు వెల్లడించారు.