పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్
- పెన్షన్ కొనసాగింపు ఇక సులువు
- ‘జీవన్ ప్రమాణ్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని
న్యూఢిల్లీ: పదవీవిరమణ చేసి, పెన్షన్ పొందుతున్న ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఉద్యోగులకో శుభవార్త. పెన్షన్ కొనసాగింపు కోసం ప్రతీ సంవత్సరం నవంబర్‌లో తాము జీవించే ఉన్నామని ధ్రువీకరించే లైఫ్ సర్టిఫికెట్‌ను సంబంధిత అధికారులకు అందించాల్సిన అవసరం కానీ.. లేదా స్వయంగా అధికారుల ముందు హాజరు కావాల్సిన అవసరం కానీ ఇకపై వారికి లేదు. అందుకు ప్రతిగా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానం ద్వారా తాము జీవించే ఉన్నామని నిర్ధారించి వారు పెన్షన్ సదుపాయాన్ని కొనసాగించవచ్చు.
‘జీవన్ ప్రమాణ్’ అనే ఈ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం రూపొందించింది. దీని ప్రకారం పెన్షన్ పొందుతున్న ప్రతీ రిటైర్డ్ ఉద్యోగి.. మొదట తన స్మార్ట్ ఫోన్ నుంచి కానీ, కంప్యూటర్ నుంచి కానీ తన ఆధార్ నంబర్‌ను, వేలిముద్రలు, కనుపాపలు.. మొదలైన బయోమెట్రిక్ వివరాలను రికార్డ్ చేయాల్సి ఉంటుంది.
దాని ప్రకారం ఆ పెన్షనర్ పూర్తి వివరాలను సెంట్రల్ డేటాబేస్‌లో నిక్షిప్తం చేస్తారు. అనంతరం.. అవసరమైనప్పుడు తన దగ్గరున్న బయోమెట్రిక్ యంత్రంపై తన బయోమెట్రిక్ వివరాలను ఆ రిటైర్డ్ ఉద్యోగి నమోదు చేసినప్పుడు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను పెన్షన్‌ను పంపిణీ చేసే సంస్థ పొందగలుగుతుంది. పెన్షన్‌ను కొనసాగిస్తుంది. దీనివల్ల వృద్ధులైన పెన్షనర్లు ఇంటి దగ్గర్నుంచే పెన్షన్ కొనసాగింపు సదుపాయాన్ని పొందవచ్చని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
స్మార్ట్ ఫోన్, లేదా కంప్యూటర్‌లపై పనిచేసే ఈ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను పెన్షనర్లందరికీ ఉచితంగా అందిస్తామని పేర్కొంది. అలాగే, తక్కువ ధరకు బయోమెట్రిక్ యంత్రాన్ని కూడా అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించింది. గ్రామీణ, సాంకేతికత అందుబాటులో లేని ప్రాంతాల వారికోసం జాతీయ ఈ గవర్నెన్స్ పథకం కింద నిర్వహిస్తున్న కామన్ సర్వీస్ సెంటర్లలోనూ ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా కోటిమందికి పైగా పెన్షన్ పొందుతున్నారు.