
ప్రమాదాలకు పెట్రోల్ బంక్‌లదే బాధ్యత
బరంపురం(ఒడిశా): హెల్మెట్ లేని వాహనాలకు ఈ నెల 16వ తేదీ నుంచి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ సరఫరా చేయరాదని కలెక్టర్ ప్రేమ్‌చంద్ చౌదరి ఆదేశాలు జారీ చేశారు. తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నియంత్రణ నేపథ్యంలో వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించి వస్తేనే బంకుల్లో పెట్రోల్ పోసేలా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని కూడా కోరారు.
ఈ నేపథ్యంలోనే ఈ 14 రోజులు ప్రజలు, పెట్రోల్ బంకుల యాజమాన్యాలను చైతన్య పరిచేందుకు జిల్లావ్యాప్తంగా శిబిరాలు నిర్వహించాలని కోరారు. ట్రాఫిక్, పోలీసు, రోడ్డు రవాణా సంస్థలు ముఖ్యపాత్ర పోషించాలని కోరారు. హెల్మెట్ లేని వాహనాలకు పెట్రోల్ సరఫరా చేసిన పెట్రోల్ బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పెట్రోల్ బంకులో సీసీ కెమెరాలు అమర్చాలని సూచించారు. దీనిపై ఎస్‌పీ ఆశిష్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ జాతీయ రహదారిలో గల పెట్రోల్ పంపుల్లో ఇంధనం పోసి బయలు దేరిన వాహనాలు ప్రమాదాలకు గురైతే పెట్రోల్ బంకు యాజమాన్యాలదే బాధ్యతగా పరిగణిస్తామని హెచ్చరించారు.
ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. విద్యా సంస్థల బస్సులు, మినీ బస్సుల రవాణా వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి తగు ఏర్పాట్లు చేపట్టాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, యాజమాన్య కమిటీలను ఆదేశించారు.