పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ లీటర్ కు 36 పైసలు, డీజిల్ లీటరుకు 87 పైసలు చొప్పున పెరిగాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరలు స్వల్పంగా పెరుగడంతో ఈ మేరకు మార్పులు చేశారు. గత ఐదు నెలల్లో పెట్రోల్ ధర పెరగడం ఇదే ప్రథమం కాగా.. గత అక్టోబర్ నెల నుంచి డీజిల్ ధర మూడుసార్లు స్వల్పంగా పెరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 60.70 ఉండగా.. పెంపుతో అది రూ. 61.06గా మారనుందని, అదేవిధంగా లీటరు డీజిల్ ధర రూ. 45.93 నుంచి రూ. 46.80లకు పెరగనుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. అంతర్జాతీయ పెట్రోల్, డీజిల్ ధరలు, రూపాయి-డాలర్ మారక విలువతో ముడిపడి ఉండటంతో మారక విలువలో వచ్చిన మార్పు వల్లే తాజాగా తలెత్తిన భారాన్ని వినియోగదారులకు బదిలీ చేసినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. 15 రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గిన సంగతి తెలిసిందే. చమురు కంపెనీలు 15 రోజులకు ఓసారి సమావేశమై.. పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తున్న విషయం తెలిసిందే.