పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా కొనసాగుతున్న ముడి చమురు ధరల తగ్గుదలను ఎక్సైజ్ సుంకం రూపంలో సర్దుబాటు చేయాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. డీజిల్, పెట్రోల్‌పై లీటరుకు రూ. 1.50 మేర ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో రూ. 13 వేల కోట్లు వార్షిక ప్రాతిపదికన ప్రభుత్వ ఖజానాకు చేరనుంది. అయితే ఈ పెంపు వల్ల పెట్రోల్, డీజిల్ రిటైల్ అమ్మకాల రేట్లలో మార్పురాదు.
ఈ ఎక్సైజ్ సుంకం పెంపుతో సాధారణ, అన్ బ్రాండెడ్ లీటర్ పెట్రోల్‌పై ప్రస్తుతం ఉన్న సుంకం రూ. 1.20 నుంచి రూ. 2.70కి, బ్రాండెడ్ పెట్రోల్‌పై రూ. 2.35 నుంచి 3.85కు అన్ బ్రాండెడ్ లీటర్ డీజిల్‌పై రూ. 1.46 నుంచి రూ. 2.96కు, బ్రాండెడ్ డీజిల్‌పై రూ. 3.75 నుంచి రూ. 5.25కు పెరగనున్నాయని ప్రభుత్వం పేర్కొంది.
ప్రాథమిక ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ సెస్, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ కలుపుకొంటే లీటర్ సాధారణ పెట్రోల్‌పై మొత్తం ఎక్సైజ్ సుంకం రూ. 4.96కు, సాధారణ డీజిల్‌పై సుంకం రూ. 10.70లకు చేరుకుంటుంది. బ్రాండెడ్ పెట్రోల్ లీటర్‌కు రూ. 11.85 కు, బ్రాండెడ్ డీజిల్ రూ. 7.25కు పెరగనుంది. ఐఓసీ చైర్మన్ బి. అశోక్ మాట్లాడుతూ.. పెరిగిన రేట్ల ప్రభావం వినియోగదారుడిపై పడదని, అంతర్జాతీ యంగా తగ్గిన రేట్లను ఎక్సైజ్ సుంకం పెంపు ద్వారా సర్దుబాటు చేస్తున్నామని చెప్పారు.