పెట్రోల్‌పై రూ.1.51 తగ్గింపు డీజిల్‌పై 50 పైసల పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్ ధర లీటర్‌పై రూ.1.51 పైసలు తగ్గింది. అయితే డీజిల్ ధర ఎప్పట్లాగే లీటరుకు 50 పైసలు పెరిగింది. సవరించిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. పెట్రోల్ ధరపై స్థానిక పన్నుల్లో తగ్గింపు, డీజిల్ ధరపై పెంపు కలుపుకుంటే ప్రాంతాలను బట్టి ధరలు మారతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు రేట్లు తగ్గడంతో పెట్రోల్‌పై రూ.1.51 తగ్గించామని, స్థానిక అమ్మకం పన్నుల్లో తగ్గింపునూ కలుపుకుంటే ఢిల్లీలో తగ్గింపు రూ.1.82కి చేరిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది.
ఈ తగ్గింపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 70.33 నుంచి రూ. 68.51కి చేరింది. పెట్రోధర ఈ నెలలో కిందకి దిగడం ఇది మూడోసారి. ఈ నెల 1న రూ.1.09, 15న రూ.2.18(స్థానిక పన్నుల్లో తగ్గింపు కలుపుకుని) తగ్గడం తెలిసిందే. పెట్రో ధర గత ఏడాది జూన్ ధరతో(రూ. 68.58)పోలిస్తే అతి తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారి. కాగా, అంతర్జాతీయ ధరల తగ్గింపుతో 14.2 కేజీల సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.19 తగ్గి, రూ. 920 నుంచి రూ. 901కి చేరింది. బల్క్ డీజిల్ ధర ఢిల్లీలో లీటరుకు రూ.1.32 తగ్గింది.
హైదరాబాద్‌లో..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.76.84 నుంచి రూ.75.02కి తగ్గగా, డీజిల్ ధర రూ.63.65 నుంచి రూ. 64.26కు పెరిగింది.