
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో వేటుకు గురైన ప్రిన్సిపల్ కార్యదర్శి ఎం శివశంకర్, ఐటీ శాఖ ఉద్యోగి స్వప్నా సురేష్
తిరువనంతపురం : గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కేరళలో పెనుప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ బాగోతంలో సీఎం కార్యాలయం ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్‌ను తొలగించారు. గత వారం వెలుగుచూసిన గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఐటీ శాఖ ఉద్యోగి పాత్రపై ఆరోపణలు బయటపడిన మరుసటి రోజే శివకంర్‌పై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. శివశంకర్ స్ధానంలో మరో ఐఏఎస్ అధికారి మిర్ మహ్మద్‌ను నియమించినట్టు సీఎంఓ కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఇటీవల దుబాయ్ నుంచి చార్టర్డ్ విమానంలో వచ్చిన కన్‌సైన్‌మెంట్ ద్వారా దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దౌత్య మార్గంలో తరలిన 30 కిలోల బంగారం విమానాశ్రయంలో పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కేరళలో యూఏఈ కాన్సులేట్‌లో పనిచేసే ఓ మాజీ ఉద్యోగిని సోమవారం కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. రూ 15 కోట్ల విలువైన గోల్డ్ స్మగ్లింగ్స్ కేసుకు సంబంధించి కస‍్టమ్స్ అధికారులు ఉద్యోగిని ప్రశ్నిస్తున్నారు.మరోవైపు ఈ వ్యవహారంలో మాజీ యూఏఈ కాన్సులేట్ అధికారి స్వప్న సురేష్ పాత్రపైనా ఆరా తీస్తున్నారు.రెండు రోజుల కిందటే ఆమెను కేరళ ఐటీ శాఖ నుంచి తొలగించారు.
విజయన్‌పై విమర్శల వెల్లువ
గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కేరళ రాజకీయాల్లో దుమారం రేపుతుండగా విపక్షాలు సీఎం విజయన్‌పై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఐటీ శాఖ ఉద్యోగి ప్రమేయం వెనుక విజయన్ హస్తం ఉందని కాంగ్రెస్, బీజేపీలు ఆరోపించాయి. సీఎం కార్యాలయం నేర కార్యకలాపాలకు అడ్డాగా మారిందని సీనియర్ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల ఆరోపించారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై సీబీఐచే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. చదవండి : కోవిడ్-19 : కేరళ కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment