వారిపై జోకులను బ్యాన్ చేయండి..! | Plea in SC seeks ban on 'Sardarji' jokes | Sakshi
Sakshi News home page

వారిపై జోకులను బ్యాన్ చేయండి..!

Published Sun, Nov 1 2015 12:00 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

వారిపై జోకులను బ్యాన్ చేయండి..! - Sakshi

వారిపై జోకులను బ్యాన్ చేయండి..!

నవ్వడం ఒక భోగం... నవ్వించడం ఒక యోగం.. నవ్వలేక పోవడం ఒక రోగం అన్నారు. అయితే ఆ నవ్వుల పువ్వులు విరిసేందుకు  హాస్యాన్ని పండించేవారూ, ఆస్వాదించేవారూ కూడ అవసరమే. స్పాంటేనియస్ గా పుట్టే హాస్యం... ఆరోగ్యంగా హాయిగా ఉంటుంది. కానీ హాస్యానికి వస్తువు ఏమిటి అనేది ఎంచుకోవడం మాత్రం ఒక్కోసారి కష్టంగానే మారుతుంది. ముఖ్యంగా నలుగురు కలిసినప్పుడు ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడంలో భాగంగా  ఏదో ఒక జోక్ చెప్పుకుని నవ్వుకుంటుంటారు. అందులో ఒక్కటైనా సర్దార్జీలపై ఉంటుండటం షరా మామూలుగా కనిపిస్తుంది. అయితే ఆ సర్దార్జీ జోక్ ల వ్యవహారం ఇప్పుడు సుప్రీం కోర్టుకు చేరింది. జోక్ లపై అభ్యంతరాలతో ఓ లాయర్ ఉన్నత న్యాయస్థానంలో పిల్ వేయడంతో కేసు విచారణ కొనసాగుతోంది.   

ముఖ్యంగా ఒకప్పుడు హాస్యాన్నిపండించేందుకు సినిమా యాక్టర్లనో, రాజకీయ నాయకులనో, భాషనో, యాసనో వస్తువుగా మలచుకునేవారు. కానీ రాను రాను అది తీవ్ర రూపం దాల్చడంతో  ఆయా సంబంధింత వర్గాలు అభ్యంతరాలు తెలుపుతూ వస్తున్నారు. దీంతో హాస్యాన్ని పండించడం ప్రస్తుత పరిస్థితుల్లో కాస్త కష్టంగానే మారింది. అయితే ఇప్పుడు సర్దార్జీ జోక్స్ పై సుప్రీంకు చేరిన పిల్ ను కోర్టు పరిశీలించేందుకు అంగీకరించింది. మొత్తం సిక్కు సమాజంపై నిర్లక్ష్యం, తొందరపాటుతనం తో వేసే జోక్స్... మానవహక్కుల ఉల్లంఘనే అవుతుందంటూ సర్దార్జీలపై వెబ్ సైట్లలో జోక్ లను తొలగించాలన్న డిమాండ్ కోర్టు పరిశీలిస్తోంది.

బుద్ధి తక్కువ వ్యక్తులుగానూ, అవివేకులుగానూ సిక్కులను చిత్రీకరిస్తుండటం బాధిస్తోందని సిక్కు న్యాయవాది హర్విందర్ చౌదరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేరస్తులకు పెనాల్టీ విధించే దిశగా అధికారులకు ఆదేశాలివ్వాలని ఆమె కోరారు. సర్దార్జీ జోక్స్ ఉన్న సుమారు ఐదు వేల వెబ్ సైట్లను నిషేధించాలని, లేదా వాటినుంచీ సిక్కు సమాజాన్ని కించపరిచే జోక్స్ ను పూర్తిగా తొలగించేందుకు  టెలికాం, ఇన్ఫర్ మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రులకు ఆదేశాలివ్వాలని ఆమె అభ్యర్థించారు. కోర్టులు... విదేశాలతో సహా అన్ని ప్రాంతాల్లో తాము అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ వాతావరణంలో తమ పిల్లలు సైతం ఇంటిపేరైన కౌర్, సింగ్ లను పెట్టుకునేందుకు ఇబ్బంది పడుతున్నారన్నారు.

న్యాయమూర్తులు టి.ఎస్. థాకూర్, గోపాల్ గౌడ లతో కూడిన ధర్మాసనం... ఈ జోక్స్ ను పలువురు సిక్కులు పెద్దగా పట్టించుకోవడం లేదని, వారిపై వారే జోక్స్ వేసుకుని హాస్యాన్ని ఆస్వాదిస్తున్నారని అన్నారు. అంతేకాక హాస్యోక్తులు రాసిన కుష్వంత్ సింగ్ కూడ  సిక్కేనని ఎత్తి చూపారు. పైగా ఎంతోమంది జోక్స్ ను స్పోర్టివ్ గా తీసుకుంటారని, అవమానంగా భావించడం లేదని అన్నారు. కేవలం వినోదం కోసం పండించే హాస్యాన్ని ఆస్వాదిస్తున్నారన్నారు. అటువంటి జోక్స్ ను పూర్తిగా నిలిపివేయాలని మీరు కోరితే... ఏకంగా సిక్కులే అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉండొచ్చని బెంచ్ అభిప్రాయ పడింది.

అయితే ఇటీవల బీహార్ లో ప్రధాని మోడీ పర్యటనను న్యాయవాది చౌదరి బెంచ్ కు ఉదహరించారు. అక్కడ జరిగిన ర్యాలీలో ప్రధాని బీహారీలు తెలివైన వారు అన్నారని, అదే మా విషయానికి వస్తే... ప్రతివారూ జోక్స్ వేసేందుకే ప్రయత్నిస్తారని చెప్పారు. దానికి బెంచ్ స్పందిస్తూ.. ఒకవేళ మోడీ పంజాబ్ వెడితే సిక్కులు కూడ తెలివైనవారని ప్రశంసిస్తారని మీరు చింతించాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా చౌదరి పిటిషన్.. ఓ నిర్దిష్ట కమ్యూనిటీకి సంబంధించిన సున్నిత విషయమని, అందుకే  ఆమె పిటిషన్ ను సుప్రీం కోర్ట్ సిక్కు న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్. కెహర్ ముందు ఉంచుతామని చెప్పారు. మీ కమ్యూనిటీ నుంచీ సుప్రీంకోర్టు ఓ న్యాయమూర్తిని కలిగి ఉండటం అదృష్టమని, అదే సమాజానికి చెందిన వ్యక్తి  సమస్యను మెరుగ్గా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని, కేసును ఆయన బెంచ్ కు తరలిస్తామని ఆమెను కోరారు. కాగా పిటిషనర్.. అందుకు అంగీకరిస్తూ... తిరిగి తన వాదనను కొనసాగించేందుకు ఒక నెల గడువును అడిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement