ఇకపై భర్తల పెత్తనం చెల్లదు...
న్యూఢిల్లీ: 'సర్పంచ్ పతి' సంస్కృతికి ఇక చరమగీతం పాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గ్రామ సర్పంచ్లుగా ఎన్నికైన మహిళల పేరుతో వారి భర్తలు పెత్తనం చెలాయించే పద్ధతికి ఇక కాలం చెల్లిందన్నారు. మహిళలు సాధికారత సాధించాల్సి అవసరం ఉందని, ఆవైపుగా వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మహిళలకు చట్టం సమాన హక్కులు కల్పించిందని, వాటిని మనం గౌరవించాలని మోదీ అన్నారు. మహాత్మాగాంధీ చెప్పినట్టుగా.. గ్రామాలు భారతదేశానికి పట్టుకొమ్మలని, అలాంటి గ్రామాల అభివృద్ధిపై దృష్టిపెట్టాలన్నారు. బాలికల విద్య, డ్రాప్ అవుట్స్ను నిరోధించే విషయంలో, వ్యాధినిరోధక టీకాల కార్యక్రమంలో గ్రామాలు కీలక పాత్ర పోషించాలన్నారు. బాలికలు ఎవరైనా స్కూల్ మానేస్తే అది తీవ్రంగా పరిగణించదగ్గ పరిణామమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై కొన్ని సలహాలిచ్చారు. గ్రామాల పట్ల గౌరవంలేకపోతే అభివృద్ధిని సాధించలేమంటూ . ఐదు సంవత్సరాల ప్రణాళికతో ముందుకు పోవాలని పంచాయితీ, జిల్లా పరిషత్ అధికారులు సలహా యిచ్చారు. ప్రభుత్వ అధికారులు సక్రమంగా పనిచేసేలా పంచాయత్ సభ్యులు చూడాలన్నారు. జాతీయ పంచాయతీరాజ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 'ఈ- పంచాయితీ అవార్డు'లను ప్రదానం చేశారు. అవార్డులు గెలుచుకున్నజిల్లా పరిషత్, గ్రామ పంచాయతీలకు అభినందనలు తెలియజేశారు.