టాటా.. ఇక సెలవ్!
వివిధ దేశాల నేతలకు ప్రధాని మన్మోహన్ వీడ్కోలు లేఖలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఇక పదవి నుంచి దిగిపోనున్న తరుణంలో వివిధ దేశాల నేతలకు వీడ్కోలు లేఖలు రాశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతోపాటు చైనా మాజీ ప్రధాని వెన్ జియాబావో, రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్, జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ తదితరులకు కృతజ్ఞతలు చెబుతూ లేఖలు రాసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇన్నేళ్లపాటు తామంతా ఎలా కలిసి పనిచేసిందీ ఆయన అందులో గుర్తుచేసినట్టు పేర్కొన్నాయి. సింగ్ లేఖకు వెన్ జవాబు కూడా పంపించారు. స్వదస్తూరీతో వెన్ రాసిన ఆ లేఖలో.. మన్మోహన్ నాయకత్వాన్ని ప్రశంసించారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలకు ఎంతగానో కృషి చేశారని ప్రధానిని కొనియాడారు. వీరిద్దరూ ఇప్పటివరకు డజను సార్లకుపైగా సమావేశమయ్యారు. జియబావో పదవి నుంచి దిగిపోయన తర్వాత గతేడాది ప్రధాని మన్మోహన్ బీజింగ్ పర్యటకు వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన ప్రధానికి ప్రత్యేకంగా విందు ఇచ్చి తమ మధ్య ఉన్న స్నేహబంధాన్ని చాటుకున్నారు. ఒబామాతో కూడా ప్రధాని అనేకసార్లు భేటీ అయ్యారు. అలాగే పుతిన్‌తో కూడా పలుమార్లు పలు సందర్భాల్లో సమావేశమయ్యారు.
14న ప్రధానికి సోనియా వీడ్కోలు విందు
ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మే 14న వీడ్కోలు విందు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా మన్మోహన్‌కు సీడబ్ల్యూసీ సభ్యులు, కేంద్ర మంత్రులందరి సంతకాలతో కూడిన జ్ఞాపికను బహూకరించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు రెండు రోజుల ముందు సోనియా ఈ విందును ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. ఫలితాలు వెలువడిన మర్నాడే, అంటే, మే 17న ప్రధాని పదవి నుంచి మన్మోహన్ వైదొలగనున్నారు. పదవి నుంచి వైదొలుగుతున్న సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాగా, యూపీఏ సర్కారుకు వరుసగా రెండుసార్లు సారథ్యం వహించిన ప్రధాని మన్మోహన్ సింగ్, ఈ ఏడాది ప్రారంభంలోనే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.