జోర్డాన్ రాజుతో ప్రధాని మోదీ ఆలింగనం
న్యూఢిల్లీ/రమల్లా/ అమాన్: నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం జోర్డాన్ చేరుకున్నారు. జోర్డాన్ రాజధాని అమాన్‌లో మోదీకి ఆ దేశ ప్రధాని హని అల్– ముల్కి ఘన స్వాగతం పలికి, ఆయన్ని రాజప్రాసాదానికి తీసుకెళ్లారు. అక్కడ మోదీకి రాజు అబ్దుల్లా–2 సాదర స్వాగతం పలికారు. ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చలు జరిపారు. రాజు అబ్దుల్లా–2తో చర్చలు ఫలప్రదంగా ముగిశాయని తర్వాత మోదీ అన్నారు. భారత విదేశీ సంబంధాల్లో పశ్చిమాసియాకు కీలక స్థానం ఉందని తెలిపారు. శనివారం పాలస్తీనా వెళ్లనున్న మోదీ ఆ దేశ ప్రధాని మహ్మద్ అబ్బాస్‌తో భేటీ అవుతారు.
భారత్ ప్రధాని ఒకరు పాలస్తీనాలో పర్యటించటం ఇదే ప్రథమం. అక్కడి నుంచి యూఏఈ వెళతారు. ఆ దేశ పాలకుడు, ప్రధానితోపాటు, అక్కడి భారతీయ వాణిజ్యవేత్తలతో సమావేశమవుతారు. ఇంధన భద్రత, మౌలికరంగాల్లో యూఏఈ సుమారు 11 మిలియన్ డాలర్ల మేర భారత్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. దుబాయ్‌లో నిర్మించిన హిందూ దేవాలయం ప్రారంభోత్సవంలో ఆదివారం పాల్గొన్న అనంతరం వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో పాల్గొని కీలక ఉపన్యాసం చేస్తారు. అక్కడి నుంచి పర్యటనలో చివరిగా ఒమన్ చేరుకుంటారు. ఒమన్ సుల్తాన్‌తోపాటు ముఖ్యనేతలతో పాటు అక్కడి ముఖ్య వ్యాపారవేత్తలతో భేటీ అయి పలు వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటారు.
భారత్ పాత్ర కీలకం: అబ్బాస్
పశ్చిమాసియా శాంతి చర్చల్లో భారత్ కీలకపాత్ర పోషించాలని పాలస్తీనా ప్రధాని మహ్మద్ అబ్బాస్ ఆకాంక్షించారు. ప్రధాని మోదీ చారిత్రక పర్యటన సందర్భంగా ఈ విషయమై చర్చిస్తామని వివరించారు. ఇజ్రాయెల్‌తో తుది ఒప్పందం కుదిరేలా అన్ని వర్గాలతో కలిపి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలనే విషయంపైనా మోదీతో మాట్లాడుతానన్నారు.
బడ్జెట్‌ను ప్రజలకు వివరించండి!
కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న పేదలు, రైతుల అనుకూల సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ఎంపీలకు మోదీ సూచించారు. క్షేత్రస్థాయిలో ఈ పథకాలను వివరించటంలో ఎంపీలు ప్రయత్నంపైనే వచ్చే ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన ఆధారపడి ఉంటుందన్నారు. శుక్రవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేతలనుద్దేశించి మోదీ మాట్లాడారు. బూత్ స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజలకు వివరించాలని.. వీటిని మరింత విస్తృతం చేసేందుకు ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ఎంపీలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment