సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నందుకు యావత్‌దేశ ప్రజలు తనను క్షమించాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహమ్మారి కరోనా వైరస్ నుంచి దేశ ప్రజలను రక్షించడం కోసమే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్లు మోదీ వివరించారు. దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తున్న తరుణంలో ప్రధాని ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి ‘మాన్ కీ బాత్’ కార్యక్రమంలో భావోద్వేగ ప్రసంగం చేశారు. (కరోనాపై పోరాటానికి ‘పీఎం-కేర్స్’)
మాక్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ‘నా ప్రియతమ దేశవాసులారా.. సాధారణంగా మన్ కీ బాత్ లో నేను అనేక విషయాలను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అయితే ఈరోజు మన దేశమే కాదు.. ప్రపంచం మనసులో కూడా ఒకే ఒక్క విషయం కదలాడుతోంది. అదే ప్రాణాంతకమైన కరోనా వ్యాధి సృష్టించిన భయంకర కష్టం. ఇటువంటి సమయంలో వేరే విషయాల గురించి మాట్లాడటం సమంజసంగా ఉండదు. ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలనుకున్నాను కానీ.. ఈ ప్రాణాంతక వ్యాధికి సంబంధించి కొన్ని విషయాలను తెలియజేయాలని నా మనసు కోరుకుంటోంది. అయితే ముందస్తుగా దేశప్రజలందరినీ క్షమించమని కోరుకుంటున్నాను. మీరందరూ నన్ను క్షమిస్తారని నా ఆత్మ చెబుతోంది. ఎందుకంటే కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
దీని వల్ల మీరందరూ ఎన్నో కష్టనష్టాలకు గురికావల్సి వస్తోంది. ముఖ్యంగా నా నిరుపేద సోదరసోదరీమణులను చూస్తుంటే ఏమనిపిస్తోందంటే వారందరూ కూడా ఈనేం ప్రధానమంత్రి? మమ్మల్ని కష్టనష్టాల ఊబిలోకి తోసేసాడు అని వాళ్లు అనుకుంటున్నారనిపిస్తోంది. నన్ను క్షమించమని ప్రత్యేకంగా వారిని కోరుకుంటున్నాను. బహుశా, చాలామంది నా మీద కోపం పెంచుకుని ఉంటారు. మమ్మల్నందరినీ ఇట్ల ఇళ్లలో బందిస్తావా అని ఆగ్రహిస్తున్నారు. నేను మీ అందరి కష్టనష్టాలను అర్థం చేసుకోగలను. మీఅందరి ఇబ్బందులను అర్థం చేసుకోగలను అయితే.. 130 కోట్ల జనాభా గల మనలాంటి దేశంలో కరోనాపై యుద్ధానికి ఇంతకుమించిన మరోమార్గం లేనేలేదు.
కరోనాతో యుద్ధమంటే జీవితానికి చావుకు మధ్య జరిగే యుద్ధం. ఈ యుద్ధంలో మనం గెలవాలి. అందుకే కఠినమైన నిర్ణయాలు తప్పనిసరి అయ్యాయి. ఎవ్వరి మనసూ ఇంత కఠినమైన నిర్ణయాలను అంగీకరించరు. అయితే ప్రపంచ దేశాల్లోని పరిస్థితులను చూస్తుంటే మిమ్మల్ని మీ కుటుంబాల్ని క్షేమంగా ఉంచడానికి ఇదొక్కటే మార్గమని తేలుతుంది. నేను మరోసారి మీకు కలిగిన ఇబ్బందులకు, కష్టాలకు క్షమించమని కోరుకుంటున్నారు.
సహచరులారా...
మనదగ్గర ఒక సూక్తి ఉంది. “ఏవం ఏవం వికార: అపి తరుణా సాధ్యతే సుఖం్ఙ అంటే వ్యాధులు, రోగాలను అవి ప్రబలకముందే, వాటిని ప్రారంభంలోనే ఎదుర్కొవాలి. లేకపోతే అవి ముదిరిన తర్వాత నివారించడం అసాధ్యమవుతుంది. రోగాలను నయం చేయడం కూడా మరింత కష్టమవుతుంది. ఈరోజు యావత్ భారతం ఒకటే చెబుతోంది. సోదరసోదరీమణులారా.. తల్లులారా... కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్నీ బందీచేసింది. జ్ఞానులను, వైజ్ఞానికులను, నిరుపేదలను, ధనవంతులను, బలహీన వర్గాలను, శక్తి మంతులను అందరినీ ఇది సవాల్ చేస్తోంది. ఇది దేశాల సరిహద్దులకు కానీ, ఒక ప్రాంత సరిహద్దులకు కానీ, ఒక వాతావరణ పరిమితులకు కాని, దేనికీ కట్టుబడటం లేదు. ఇది మానవజాతిని నాశనం చేయడానికీ, అంతం చేయడానికీ పట్టుబట్టి కూర్చుంది. అందుకే అందరూ.. కలిసికట్టుగా, యావత్ మానవజాతీ ఈ వైరస్ అంతంచూడడానికి సంకల్పం చేసుకోవాలి. లాక్ డౌన్ ను పాటిస్తూ ఇతరులను కాపాడుతున్నామన్న భావన కొంతమందిలో కలుగుతోంది. ఇది కేవలం అపోహ. ఈ భ్రమలోంచి బయటపడండి.
ఈ లాక్ డౌన్ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికీ, మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవడానికీ. ఇంకా ముందు ముందు కూడా కొన్ని రోజుల వరకు మీరు ఓర్పు వహించక తప్పదు సహనం ప్రదర్శించాలి. లక్ష్మణరేఖను దాటకూడదు. సహచరులారా.. నాకు తెలుసు ఎవ్వరూ కూడా కావాలని చట్టాన్ని ఉల్లంఘించాలని కోరుకోరు. నియమనిబంధనలను పాటించకూడదని ఎవ్వరూ అనుకోరు. కానీ కొంతమంది ఇట్లా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్లు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోలేకపోతున్నారు. వారందరినీ కోరేది ఒక్కటే లాక్ డౌన్ నియమాలను పాటించకపోతే. కరోనా వైరస్ నుంచి కాపాడుకోవడం కష్టతరమవుతుంది. ప్రపంచంలో చాలా మంది ఈ అపోహలతోనే కాలం గడిపారు. ఇప్పుడు పశ్చాతాప పడుతున్నారు. ఆరోగ్యం పరం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనం అంటే ఆరోగ్యమే మహాభాగ్యం.
ఆరోగ్యమే, దేనినైనా సాధించడానికి సాధనం. ప్రపంచంలో అన్ని సుఖాలను పొందడానికి సాధనం కేవలం ఆరోగ్యమే అందుకే లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించేవారు తమ జీవితంతో ఆటలాడుకుంటున్నారని చెప్పక తప్పదు. ఈ యుద్ధంలో అనేక మంది యోధులు కేవలం ఇంట్లో కూర్చొని కాకుండా బయటకు వెళ్లి కరోనా వైరస్ తో పోరాడుతున్నారు. వీరంతా యుద్ధంలో అగ్రభాగాన నిల్చిన సైనికులు. ముఖ్యంగా నర్సులు. ఈ నర్సుల్లో మన సోదరులు, సోదరీమణులు కూడా ఉన్నారు. డాక్టర్లు, సహచర వైద్య సిబ్బంది వీరంతా కరోనాను ఓడిస్తున్నారు. మనం వీరి నుంచి స్ఫూర్తి పొందాలి. ఈ మధ్య నేను కొంత మందితో ఫోన్ లో మాట్లాడాను. వారిలో ఉత్సాహాన్ని నింపాను. వారితో మాట్లాడటం వల్ల నాలో మరింత ఉత్సాహం పెరిగింది. వారితో మాట్లాడి ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. ఈసారి మన్ కీ బాత్ ద్వారా ఆ సహచరుల అనుభవాలు, వారితో మాట్లాడిన విషయాలు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.
Comments
Please login to add a commentAdd a comment