ప్రధాని మోదీకి మళ్లీ అసంతృప్తి..గైర్హాజరుపై గుస్సా
న్యూఢిల్లీ: తన పార్టీకి చెందిన ఎంపీలపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి అసంతృప్తిని వ్యక్తం చేశారు. శుక్రవారం నాటి రాజ్యసభ సమావేశాలకు తక్కువ మంది ఎంపీలే హాజరవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగిన సమయంలో మోదీ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ఎంపీ తెలిపారు.
కొన్ని బిల్లులపై గతవారం చర్చించాలనుకున్న సమయంలో పలువురు ఎంపీలంతా కూడా తమ నియోజకవర్గాల్లో ఉన్నారని, దాంతో ఆరోజు మధ్యాహ్నం జరగాల్సిన పనులు సాయంత్రం అయ్యాయని, దీనిపై మోదీ అసంతృప్తి ఉన్నట్లు వెల్లడించారు. ఇక పార్టీయేతర ఎంపీలకు సంబంధించిన ప్రైవేటు బిల్లులు మాత్రం కచ్చితంగా శుక్రవారం మాత్రం సభ ముందుకు తీసుకురావాలని మోదీ తెలిపినట్లు వివరించారు. 'శుక్రవారం మీ వంతు.. మిగితా రోజులన్నీ కూడా ప్రభుత్వానివి' అని మోదీ అన్నారట. కచ్చితంగా ఎంపీలు సమావేశాల సమయంలో ఐదు రోజులు హాజరుకావాల్సిందేనని, సిన్సియర్‌గా సభా కార్యక్రమాలకు హాజరుకావాలని ఆదేశించినట్లు వెల్లడించారు.