లాక్‌డౌన్‌ 5.0 : ఆ నగరాలపై ఫోకస్‌ | PM Modi May Announce Lockdown 5.0 On Mann Ki Baat | Sakshi
Sakshi News home page

పలు సడలింపులతో మరో లాక్‌డౌన్ ?

Published Wed, May 27 2020 3:29 PM | Last Updated on Wed, May 27 2020 5:32 PM

PM Modi May Announce Lockdown 5.0 On Mann Ki Baat - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ 4.0 మే 31తో ముగుస్తున్న క్రమంలో అదేరోజు మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో మరికొన్ని సడలింపులు ప్రకటిస్తూనే లాక్‌డౌన్‌ 5.0ను ప్రధాని ప్రకటించవచ్చని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో 70 శాతం కేసులు వెలుగుచూస్తున్న 11 నగరాలపైనే లాక్‌డౌన్‌ 5.0 ప్రధానగంగా దృష్టిసారిస్తుందని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

జూన్‌ 1 నుంచి మొదలయ్యే లాక్‌డౌన్‌ 5.0 ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూర్‌, పుణే, థానే, ఇండోర్‌, చెన్నై, అహ్మదాబాద్‌, జైపూర్‌, సూరత్‌, కోల్‌కతా నగరాల్లో కరోనా కట్టడిపై ఫోకస్‌ చేయనుంది. ఇక దేశవ్యాప్తంగా నమోదైన 1.51 లక్షల కరోనా కేసుల్లో అహ్మదాబాద్‌, ఢిల్లీ, పుణే, కోల్‌కతా, ముంబై నగరాల్లోనే 60 శాతం కేసులు నమోదవడంతో ఈ నగరాల్లో మహమ్మారి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. మొత్తం కరోనా కేసుల్లో 80 శాతం కేసులు నమోదవుతున్న 30 మున్సిపల్‌ కార్పొరేషన్‌లతో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది.

చదవండి: హృ‌ద‌య విదార‌కం: చ‌నిపోయిన‌ త‌ల్లిని లేపుతూ..
భారీ సడలింపులు
లాక్‌డౌన్‌ 5.0లో దేవాలయాలు, మసీదులు, చర్చిలు తెరుచుకునేందకు అనుమతించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే ప్రార్ధనా స్ధలాల్లో భారీగా ప్రజలు గుమికూడటం నిషేధిస్తూ కోవిడ్‌-19 నిబంధనలను పాటించేలా వీటిని అనుమతించేందుకు కేంద్రం మొగ్గుచూపే అవకాశం ఉంది. ప్రార్థనా స్ధలాల్లో ప్రతిఒక్కరూ విధిగా మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేయనున్నారు. కాగా జూన్‌ 1 నుంచి అన్ని ప్రార్ధనా స్ధలాలను తెరిచేందుకు అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయనికి లేఖ రాసింది.

జిమ్‌లకు అనుమతి!
లాక్‌డౌన్‌ 4.0లో సెలూన్లకు అనుమతించిన ప్రభుత్వం తాజాగా జిమ్‌లను తెరిచేందుకు అనుమతించనుంది. కంటెయిన్మెంట్‌ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో జిమ్‌లు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలతో జిమ్‌లను అనుమతిస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement