సాక్షి, న్యూఢిల్లీ : మహిళను గౌరవించే సంప్రదాయం భారత సంస్కృతిలో ఎప్పటినుంచో ఉందని, భూగోళమంతటా నారీ శక్తి కీలక భూమిక పోషిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆలిండియా రేడియోలో ప్రసంగించిన ఆయన మహిళా సాధికారత అవసరాన్ని మరోసారి గుర్తుచేశారు.
‘‘నేడు బేటీ బచావో, బేటీ పడావో గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ వేల ఏళ్ల కిందటే మన పూర్వీకులు ఒక నానుడి చెప్పారు.. ఒక కుమార్తె పదిమంది కుమారులతో సమానమని! అవును. ఇవాళ అన్ని రంగాల్లోనూ మహిళలు పురోగమిస్తున్నారు. ఈ గడ్డపై పుట్టిన కల్పనా చావ్లా వ్యోమగామిగా సాధించిన విజయాలు గర్హనీయం. అతి చిన్న వయసులోనే ఆమెను మనం కోల్పోవడం దురదృష్టకరం. ముంబైలోని మాతుంగ రైల్వే స్టేషన్‌లో అందరూ మహిళలే విధులు నిర్వర్తిస్తున్నారు. 'ఆల్ ఉమన్ రైల్వేస్టేషన్'గా మాతుంగ కీర్తిగడించింది. భవనా కాంత్, మోహన సింగ్, అవని చతుర్వేది అనే పైలట్లు సుఖోయ్ విమానాన్ని నడిపేందుకు శిక్షణ తీసుకుంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ప్రభావిత దంతేవాడలో గిరిజన మహిళలు ఇ-రిక్షాలు నడుపుతూ సాధికారత బాటలో పయనిస్తూ దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు..’’ అంటూ మోదీ పలు ఉదాహరణలు చెప్పుకొచ్చారు. పద్మా అవార్డులు పొందిన మహిళా మణులను సైతం ప్రధాని తన ప్రసంగంలో గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment