బర్న్‌పూర్‌లో స్టీల్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమత
- ప్రధాని నరేంద్ర మోదీ ‘సమాఖ్య’ మంత్రం
- కేంద్రం, రాష్ట్రాలు కలసి పనిచేయాలి
- ప్రధాని, ముఖ్యమంత్రులు ఒక జట్టుగా ఉండాలి
- దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయం, బేలూరు మఠాల సందర్శన
బర్న్‌పూర్(పశ్చిమబెంగాల్): కేంద్రం-రాష్ట్రాల మధ్య సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లినప్పుడే దేశం అభివృద్ధి బాటలో పురోగమిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టంచేశారు. ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసి ‘టీం ఇండియా’ మాదిరి పనిచేయాలన్నారు. అప్పుడే అభివృద్ధితోపాటు ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు.. ఆదివారం ఆయన పశ్చిమబెంగాల్‌లోని బర్న్‌పూర్‌లో ఆధునీకరించిన ఐఐఎస్‌సీఓ స్టీల్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఇందులో సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు.
‘గతంలో కేంద్రం, రాష్ట్రా లకు మధ్య అంత సఖ్యత ఉండకపోవడం దురదృష్టకరం. నేనూ చాలా ఏళ్లపాటు సీఎంగా పనిచేశా. కేంద్రం-రాష్ట్రాల సంబంధాలు ఎప్పుడూ అంత బాగుండేవి కాదు. అందరినీ కలుపుకొని పోలేని రీతిలో కేంద్రం వైఖరి ఉంటే దాంతో రాష్ట్రాలకు ఒరిగేదేమీ ఉండదు. కానీ మేం అధికారం చేపట్టాక సమాఖ్య వ్యవస్థకు పెద్దపీట వేస్తున్నారు. ప్రధాని, సీఎంలు టీం ఇండియాలా పనిచేయాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. కేంద్రం మాత్రమే ఈ దేశాన్ని పాలించదు. కానీ దురదృష్టవశాత్తూ గత 60 ఏళ్లలో ఇదే జరిగింది. ఒక్క ఢిల్లీ అనే పునాదిపైనే ఈ దేశం నిలబడదు. దానికి మరో 30(రాష్ట్రాలు) పునాదులు సాయంగా నిలవాలి’ అని అన్నారు.
అన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో ఏర్పాటైన నీతి ఆయోగ్‌ను సమాఖ్య స్ఫూర్తికి ఉదాహరణగా చూపారు. ఇటీవల బంగ్లాదేశ్‌తో కుదిరిన సరిహద్దు ఒప్పందం టీం ఇండియా సాధించిన విజయమన్నారు. 41 ఏళ్లుగా నలుగుతున్న ఈ సమస్యకు బెంగాల్, అస్సాం, త్రిపురలతో కలసి కేంద్రం ఒక శాశ్వత పరిష్కారం చూపిందన్నారు. అందరూ కలసి పనిచేస్తే అంతర్గత సమస్యలతోపాటు అంతర్జాతీయ సమస్యలు కూడా పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.
బెంగాల్ శక్తే.. దేశానికి శక్తి!
గతంలో దేశ ఆర్థిక వ్యవస్థకు పశ్చిమబెంగాల్ చుక్కానీగా నిలిచిందని ప్రధాని అన్నారు. ఈశాన్య భారతాన్ని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఇందుకు ముందుగా బెంగాల్‌ను మరింత బలోపేతం కావాల్సి ఉందన్నారు. ‘గతంలో దేశ ఆర్థిక పురోగతి బెంగాల్‌పైనే ఆధారపడి ఉండేది. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇప్పుడు బెంగాల్ అభివృద్ధి నిచ్చెన ఎక్కాలి. మళ్లీ పూర్వవైభవం రావాలి. బెంగాల్ శక్తిమంతం కాకుండా దేశంలో ఇతర ప్రాంతాలు కూడా శక్తిమంతం కాలేవు’ అని అన్నారు.
రాజకీయ విభేదాలు ఉన్నా.. అవి అభివృద్ధికి అవరోధంగా నిలవొద్దన్నారు. యూపీఏ హయాంలో మీడియాలో బొగ్గు స్కాం వార్తలే ఉండేవని, ఇప్పుడు మాత్రం బొగ్గు వేలం వార్తలు ఉంటున్నాయన్నారు. తాము అధికారం చేపట్టి ఏడాది కావొస్తున్నా ఒక్క స్కాం మచ్చ లేదన్నారు.
ఈశాన్యం నుంచే రెండో హరిత విప్లవం
దేశంలో రెండో హరిత విప్లవానికి ఈశాన్య రాష్ట్రాలే నాయకత్వం వహించాలని ప్రధాని అన్నారు. రైతన్న బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. ‘దేశానికి తిండి పెట్టాలంటే రెండో హరిత విప్లవం రావాలి. ఇది ఈశాన్య రాష్ట్రాల నుంచే ప్రారంభం కావాలి. పశ్చిమ భారతంలో అనేక ఆర్థిక కార్యకలాపాలు సాగుతుంటాయి. కానీ ఈశాన్యం మాత్రం కాస్త స్తబ్ధుగా ఉంటుంది. ఇలా ఒక ప్రాంతం అనారోగ్యంతో ఉంటే దేశం ముందుకు వెళ్లదు. ఈ పరిస్థితిని మార్చాల్సి ఉంది’ అని అన్నారు. అంతకుముందు మమత మాట్లాడుతూ.. కలసి పనిచేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని, లేదంటే కుప్పకూలుతుందన్నారు. ఇక్కడి స్టీల్‌ప్లాంట్‌ను రూ.16 వేల కోట్లతో ఆధునీకరించారు.
దక్షిణేశ్వర్‌లో కాళీమాతకు పూజలు
కోల్‌కతా సమీపంలోని దక్షిణేశ్వర్ ఆలయం, బేలూర్ మఠాన్ని ప్రధాని సందర్శించారు. ఆదివారం ఉదయం 7.55 గంటలకే దక్షిణేశ్వర్ ఆలయానికి చేరుకున్నారు. రామకృష్ణ పరమహంస ఆరాధించిన కాళీమాత అమ్మవారికి పూజలు చేశారు. దేశాన్ని అభివృద్ధి చేసేందుకు తనకు శక్తి ప్రసాదించాల్సిందిగా కోరారు. తర్వాత రామకృష్ణ మఠం ప్రధాన కేంద్రమైన బేలూరు మఠానికి వెళ్లారు. మఠంతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకొని ఉద్వేగానికి గురయ్యారు. స్వామి వివేకానంద తన చివరి రోజుల్లో గడిపిన గదికి వెళ్లారు. స్వామి పాదరక్షల చెంత 15 నిమిషాలపాటు ధ్యానం చేశారు.
సందర్శకులకు అద్దాల ద్వారా ఈ గదిని చూసేందుకు అనుమతిస్తారు. ప్రధానికి మాత్రం ప్రత్యేకంగా తలుపులు తెరిచి లోపలికి అనుమతించారు.‘పిల్లాడు తన ఇంటికి వస్తే ఎవరైనా స్వాగతం పలుకుతారా’ అంటూ సన్యాసులతో వ్యాఖ్యానించి మఠాన్ని తన సొంతిల్లుగా అభివర్ణించారు. సన్యాసులతో కలసి ఫొటో దిగారు. ఈ పర్యటనల తర్వాత మోదీ ఢిల్లీ వెళ్లారు. మోదీ బాల్యంలో సన్యాసం స్వీకరించేందుకు ప్రయత్నించారు. రెండేళ్లపాటు హిమాలయాల్లో గడిపి ఇంటికొచ్చారు. స్వామి ఆత్మస్థానంద (ప్రస్తుత రామకృష్ణ మఠం అధ్యక్షుడు) వద్ద ఆధ్యాత్మిక శిక్షణ పొందారు.